ఆదిలాబాద్ రిమ్స్‌లో మరో వివాదం!

-గుట్టుచప్పుడు కాకుండా 11 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
-నోటిఫికేషన్ లేదు.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంతకన్నా లేదు
-మహాలక్ష్మి ఏజెన్సీ ద్వారా దొడ్డిదారిన నియామకాల
-అక్రమాలకు బ్రేక్ వేసిన కలెక్టర్.. నియామకాలు రద్దు

ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. నిబంధనలకు పాతరవేస్తూ, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అసలు రిమ్స్‌లో ఏం జరిగింది? దొడ్డిదారిన ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందించారు?

ఆదిలాబాద్‌లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇక్కడ మరో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ఏకంగా 11 ఔట్ సోర్సింగ్ పోస్టులను అధికారుల కనుసన్నల్లోనే, ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ చిన్న పోస్టు భర్తీ చేయాలన్నా బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలి. కానీ, రిమ్స్ అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు. ‘మహాలక్ష్మి మ్యాన్ పవర్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్’ అనే ఏజెన్సీ ద్వారా 11 పోస్టులను దొడ్డిదారిన భర్తీ చేసేశారు. ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అసిస్టెంట్ వంటి కీలక పోస్టులకు ఎలాంటి పారదర్శకత లేకుండా అపాయింట్‌మెంట్స్ ఇచ్చేశారు.

ఈ అక్రమ నియామకాలకు సంబంధించి గత నెల 23వ తేదీన రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ పేరుతో అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ కావడం గమనార్హం. అయితే, చీకటి చాటున జరిగిన ఈ నియామకాల వ్యవహారం కాస్తా బయటకు పొక్కడంతో దుమారం రేగింది. అర్హులైన నిరుద్యోగులు ఉండగా, ఇలా అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన కలెక్టర్.. రిమ్స్ అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో దిగివచ్చిన రిమ్స్ అధికారులు.. అక్రమంగా భర్తీ చేసిన ఆ 11 ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామక ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

కలెక్టర్ జోక్యంతో అక్రమ నియామకాలు రద్దయి, వివాదానికి ప్రస్తుతానికి తెరపడినప్పటికీ.. అసలు ఈ తతంగం వెనుక ఎవరెవరి హస్తం ఉంది..? ఏజెన్సీతో కుమ్మక్కైంది ఎవరు..? అనే కోణంలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

You might also like