తల్లికి బంగారం ఇద్దామని.. తీరని కడుపుకోత మిగిల్చాడు!

కన్నతల్లికి ఓ చిరు కానుక ఇద్దామనుకున్నాడు.. ఆమె మెడలో ఓ చిన్న బంగారు ఆభరణం చూసి మురిసిపోవాలనుకున్నాడు. కానీ, అమ్మపై ఉన్న ఆ ప్రేమే.. ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. సైబర్ రాబందుల వేటుకు.. ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నింపిన విద్యార్థి ‘సంపత్’ ఆత్మహత్య వెనుక కన్నీరు పెట్టించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లూ వినిపిస్తున్నట్లు ఇది తోటి విద్యార్థుల వేధింపుల వల్ల జరిగిన ఆత్మహత్య కాదని.. బెట్టింగ్ మాయాజాలం అంతకంటే కాదని… పోలీసులు చెబుతున్నారు… ఇంత‌కీ సంపత్ ప్రాణాలు ఎందుకు తీసుకున్నాడు? అసలేం జరిగింది?

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంపత్ ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తన కుమారుడికి స్నేహితులే బెట్టింగ్ అలవాటు చేశారని, వారి వల్లే ఈ దారుణం జరిగిందని మృతుడి తల్లి విజయ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి సంపత్ వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్ చేసి విచార‌ణ షురూ చేశారు. అయితే, ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే, కంటతడి పెట్టించే నిజాలు తెలిశాయి. సంపత్ ఆత్మహత్యకు తోటి విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని, అలాగే ఆన్లైన్ బెట్టింగ్ ఆడి చనిపోయాడన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఎలాగైనా సరే తన తల్లికి ఓ బంగారు ఆభరణం కొనివ్వాలనేది సంపత్ ఆశ. ఆ ఆశే అతడిని సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి నెట్టింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ జ్యువెలరీ షాపు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో తన వద్ద ఉన్న డబ్బంతా పెట్టుబడిగా పెట్టాడు. కానీ, డబ్బులు చెల్లించిన క్షణాల్లోనే ఆ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ డిలీట్ అయిపోయింది. తాను ఓ సైబర్ మోసగాడి చేతిలో మోసపోయానని ఆ యువకుడికి అర్థమైంది. తల్లి కోసం ఎన్నో ఆశలతో కూడబెట్టుకున్న డబ్బులు పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ బాధను దిగమింగుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక.. తన కలలను, ప్రాణాలను ఉరితాడుకు వదిలేశాడు. ఇదొక పక్కా సైబర్ క్రైమ్ అని నిర్మ‌ల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ మీడియా సమావేశంలో వెల్ల‌డించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును వేగవంతం చేశామ‌ని వెల్ల‌డించారు.

కన్నతల్లికి బంగారం కొనివ్వాలన్న ఆ కొడుకు ఆశ, చివరికి ఆ తల్లికి కడుపుకోతను మిగిల్చింది. ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు వస్తాయంటూ టెలిగ్రామ్, వాట్సాప్ లలో వచ్చే నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ల పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవడమే కాదు.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు. ఒకవేళ మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను (1930) ఆశ్రయించాలి కానీ, ఇలా చావును పరిష్కారంగా ఎంచుకోవద్దు.

You might also like