సింగరేణిలో మరో సమ్మె శంఖం
అమలు కాని హైపవర్ వేతనాలు - ఇబ్బందుల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు - 25 వేలకుపైగా దినసరి కార్మికుల వెతలు - కనీస వేతనాలు, హక్కులు అమలు లేదు - జనవరి 4 తర్వాత ఎప్పుడైనా సమ్మె
ఏరియా ఆసుపత్రి మొదలుకుని, జీఎం ఆఫీసు వరకు… సివిల్ పనుల దగ్గర నుంచి భూగర్భ గని వరకు వారు చేయని పని లేదు… సింగరేణిలో వారు లేని డిపార్ట్మెంట్ లేదు.. కానీ వేతనాల విషయంలో మాత్రం వారికి తీరని అన్యాయం జరుగుతోంది. ఏండ్ల తరబడి పోరాటం చేసినా వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అందుకే జనవరి 4 తర్వాత సమ్మెకు దిగేందుకు వారు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే దీనిపై సమ్మె నోటీసు అందించిన కాంట్రాక్టు కార్మికులు ఆదివారం గోదావరిఖనిలో జరిగే పోరు గర్జన సభలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కానున్నారు.
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవస్థలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటి గురించి పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో సుమారు 25 వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్తత్తిలో వీరూ రెగ్యులర్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నా పనికి తగిన వేతనం లేదు. పర్మినెంట్‌కు నోచడం లేదు. సింగరేణి సంస్థలో జరిగే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాంట్రాక్టు కార్మికులు. మరి అలాంటి కార్మికులను యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సింగరేణిలో సంస్కరణల ఫలితంగా 1లక్షల 20 వేల మంది కార్మికుల నుంచి 40 వేల మంది కార్మికులకు తగ్గిపోయారు. పర్మినెంట్ కార్మికులను తొలగించిన స్థానంలో కొత్తవారిని భర్తీ చేయకుండా కాంట్రాక్టు కార్మికులను నియమించారు. ఇలా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో సుమారు 25 వేలకు పైగా కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి కనీస వేతనాలు చట్టబద్దమైన హక్కులు అమలు చేయకుండా వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు.
అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్టు కార్మికులే…
సింగరేణి సంస్థలో రెగ్యులర్ కార్మికులకు ధీటుగా కాంట్రాక్టు కార్మికులు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి మొదలు బొగ్గు సరఫరా, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి రవాణా,ఎక్సప్లోరేషన్,స్టోర్లు,పారిశుధ్యం,బెల్ట్ క్లీనింగ్ రైల్వే సైండింగ్,తోటమాలి,హౌస్ కీపింగ్,కన్వేయన్స్ వెహికల్ డ్రైవర్లు, ఓసీపీ ఆపరేటర్లు, బ్లాస్టింగ్ వర్కర్లు, క్యాజువల్ లేబర్‌గా కొనసాగుతున్నారు.
పర్మినెంట్‌కు నోచుకునేనా..?
పదిహేను సంవత్సరాలకు పైగా సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తూ చాలీచాలని వేతనాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నడుమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాను గద్దెనెక్కితే పర్మినెంట్ చేస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో కనీసం వారిని పట్టించుకోవడం లేదు. గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ కూడా ఇచ్చిన మాట ప్రకారం పర్మినెంట్ చేయడంలో విఫలం కావడంతో కాంట్రాక్టు కార్మికులు అవస్థలు పడుతున్నారు. మిగతా కార్మిక సంఘాలు సైతం వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
హైపవర్ కమిటీ వేతనాలేవీ..?
జాతీయ వేతన ఒప్పందంలో భాగంగా కాంట్రాక్టు కార్మికులకు 2013 జనవరి 1 నుండి కనీస వేతనం రోజుకు అన్‌స్కిల్డ్ 464 రూ, సెమిస్కిల్డ్ రూ.494, స్కిల్డ్ రూ. 524, హై స్కిల్డ్ రూ. 554, చెల్లించాల్సి ఉన్నా హైపర్ వేతనాలకు ఇప్పటికీ కాంట్రాక్టు కార్మికులు నోచుకోవడం లేదు. అలాగే చట్టబద్దంగా రావాల్సిన బోనస్, సీఎంపీఎఫ్, వైద్య సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఒప్పందం ఉన్నా వాటిని పట్టించుకోవడంలేదు. కోల్ ఇండియా పరిధిలోని బొగ్గు సంస్థల్లో ఇవన్నీ అమలు చేస్తున్నా సింగరేణిలో మాత్రం యాజమాన్యం అమలు చేయడం లేదు. బోనస్ చట్టం-2006 ప్రకారం చెల్లించాల్సిన బోనస్ ఇంత వరకు చెల్లించడం లేదు.
వారి సంక్షేమం గాలికే..
కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కనీసం ఐదు శాతం కూడా నిధులు వెచ్చించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెత్తాచెదారం తరలించడం, మురుగుకాల్వలను శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతున్నా వారి బతుకులు మాత్రం అధ్వానంగానే ఉంటున్నాయి. సెప్టెక్ ట్యాంక్‌లు శుభ్రపరుస్తున్న కాంట్రాక్టు కార్మికులు అనారోగ్యం బారిన పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇలా ప్రతి పనిలోనూ వీరు కీలకంగా మారినా వేతనాల్లో, పర్మినెంట్‌తోపాటు ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
అందుకే పోరుబాట…
తమ సమస్యలు పట్టించుకోకపోవడంతో తాము పోరుబాట పడుతున్నట్లు కాంట్రాక్టు కార్మికులు స్పష్టం చేస్తున్నారు. తాము ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ నెల 21న కొత్తగూడెంలోని డిప్యూటీ పీఎం హన్మంతరావుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చారు. జనవరి 4 తర్వాత ఏ రోజునైనా తాము సమ్మెకు వెళ్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖనిలో పోరుగర్జన సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. వీరు సమ్మెకు వెళ్లే సింగరేణిలో ఖచ్చితంగా ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
జనవరి 4 తర్వాత సమ్మెలోకి… బోగె ఉపేందర్- ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఖచ్చితంగా హైపర్ వేతనాలు చెల్లించాలి. లేకపోతే జీవో నంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఈ సమ్మె విషయంలో ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి నోటీసులు అందించాం. కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలి.