యూట్యూబ్ చానళ్ల పట్ల కఠిన వైఖరి
యూట్యూబ్ చానళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాడీ షేమింగ్ పై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిని అందరూ ఖండిస్తున్నారు. యూట్యూబ్ యజమాన్యంతో ఈ విషయమై తెలంగాణ అధికారులు ఇప్పటికే మాట్లాడారు. అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి నిర్వహించే అన్ని చానళ్లు తమ నిర్వాహకుల పేరు, చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై సోమవారం లేఖ కూడా రాయనున్నారు.
నిబంధనలు పట్టకుండా ఇష్టారీతిన కంటెంట్ పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ చానళ్లు చాలానే ఉంటున్నాయి. సుమారు 200కు పైగా యూట్యూబ్ చానళ్లు రాష్ట్రం నుంచి పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వీటిల్లో మెజారిటీ చానళ్లకు కార్యాలయ చిరునామా, నిర్వహణదారుల పేరు, చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ వివరాలు ఏవీ లేవని గుర్తించారు. పరువుకు నష్టం కలిగించే, అభ్యంతరకరమైన కంటెంట్ ను ఈ చానళ్లు ప్రసారం చేస్తున్నాయని, అటువంటి చానళ్ల నిర్వాహకులను గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, అభ్యంతరకరమైన కంటెంట్ ను పోస్ట్ చేసే చానళ్లను నిలిపివేయడం లేదా బ్లాక్ చేసే విధంగా యూట్యూబ్ యాజమాన్యాన్ని లేఖ రూపంలో కోరాలని సర్కారు నిర్ణయించింది. మరోవైపు ఎలాంటి ఛానళ్లు, పత్రికలు లేకున్నా సోషల్ మీడియా పేరుతో చాలా మంది పని చేస్తున్నారు. వారు స్థానికంగా బెదిరింపులకు దిగుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు.. వీరిపై కూడా నిఘా పెట్టామని పోలీసు అధికారి ఒకరు నాంది న్యూస్‌కు వెల్లడించారు. వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నాం… కొందరు అధికారులు సైతం వారికి సపోర్టు చేస్తున్నారనే విషజ్ఞం మా దృష్టికి వచ్చింది. దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.