నేడే బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని, ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు. పార్టీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. తొలుత కార్యక్రమాన్ని ఇందిరాపార్కు వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కరోనా కారణంగా ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్, జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారు.
అభ్యంతరం ఎందుకు..?
తాము చేపట్టిన నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కరోనా నిబంధనలకు లోబడి పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన చేపడుతున్న దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరారు. నిరుద్యోగ దీక్ష భగ్నం చేయాలన్న ఉద్దేశంతో ఇందిరాపార్కు వద్ద అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డిలు ఓ ప్రకటనలో ఆరోపించారు. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడిస్తారో స్పష్టంగా చెప్పాలని కేటీఆర్‌కు భాజపా శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్ లేఖ రాశారు.