కల్తీ కల్లు స్థావరంపై దాడులు
కల్తీ చేయడానికి ఉపయోగించే ముడి సామగ్రి స్వాధీనం
మంచిర్యాల : కల్తీ కల్లు తయారు చేస్తున్న స్థావరం పైన సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, తాండూర్ పోలీసుల మెరుపు దాడి చేశారు. కల్తీ చేయడానికి ఉపయోగించే ముడి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కల్తీ కల్లు తయారు చేస్తున్న నిర్వాహకుడు దాసరి మనోహర్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఈ సందర్భంగా 410 లీటర్ల కల్తీ కల్లు, దాని తయారీకి కావాల్సిన మూడు కిలోల అమ్మోనియా, వైట్ కలర్, నిమ్మ ఉప్పు సుమారు 2 కిలోలు, బేకింగ్ సోడా 2 కిలోలు, బ్లీచింగ్ పౌడర్ సుమారు 3 కిలోలు, మినప పిండి సుమారు కిలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ సిఐ మహేందర్ మాట్లాడుతూ ఈ కల్తీ కల్లు తయారీలో ప్రజల ప్రాణాలకి హాని కలిగించే వస్తువులను వాడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి కల్తీ వ్యాపారం చేసే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న , తాండూర్ ఎస్ఐ కిరణ్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ నిర్మల పాటిల్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.