16 వేల మందికి ఉద్యోగాలు
తెలంగాణలో మొదటి నోటిఫికేషన్ సింగరేణి దే - కారుణ్య, వారసత్వల ద్వారా 12,553 ఉద్యోగాలు - ప్రత్యక్ష రిక్రూట్ మెంట్ ద్వారా 3,498 మందికి కొలువులు - ముఖ్యమంత్రి ఆదేశంతో త్వరితగతిన నియామకాలు కొత్త నియామకాలు కూడా కొనసాగుతాయి : సీఅండ్ ఎండీ శ్రీధర్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్, లాభాలు ఆర్జించడమే కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించడంలోనూ అగ్రగామిగా ఉంటోంది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ సూచన మేరకు సింగరేణి సంస్థ ఏడేళ్ల కాలంలో ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా, కారుణ్య, వారసత్వ నియామకాల ద్వారా మొత్తం 16,040 మందికి ఉద్యోగాలు కల్పించింది. వీటిలో కారుణ్య వారసత్వ ఉద్యోగాల కింద 12,553 మందికి ఉద్యోగాలు ఇవ్వగా, డైరెక్ట్ ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా 3,498 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంతపెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించిన సంస్థల్లో సింగరేణి అగ్రస్థానంలో ఉంది.
58 ఉద్యోగ నోటిపికేషన్లు 3,498 మందికి ఉద్యోగాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు సింగరేణిలో వివిధ శాఖల్లో గల పలురకాల కార్మిక స్థాయి, అధికారుల స్థాయి పోస్టుల ఖాళీలను గుర్తించి, వీటిని భర్తీ చేయడం కోసం 2014 నుండి ఇప్పటి వరకూ 58 నోటీఫికేషన్లు జారీ చేసి 3,498 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పించింది.
సింగరేణి కల్పించిన ఉద్యోగాలలో కొన్ని…
సింగరేణి సంస్థ మొత్తం 35 కేటగిరీలలో ఉద్యోగాలు కల్పించగా వీటిలో ప్రధానంగా మైనింగ్ సూపర్ వైజర్లు (809), ఫిట్టర్లు (578), క్లర్కులు (471), ఎలక్రీషీయన్లు (358), మెకానికల్ సూపర్ వైజర్లు (141) టర్నర్లు / మెషినిస్టులు (121), వెల్డర్లు (94), ఎలక్ట్రీకల్ సూపర్ వైజర్లు (84), స్టాఫ్ నర్సులు (68), సివిల్ సూపర్ వైజర్లు (65), సర్వేయర్లు (48), మోటార్ మెకానిక్లు (40), మౌల్డర్లు (24) తదితర ఉద్యోగాలతో పాటు అధికార హోదాలో మైనింగ్ ఇంజనీర్లు (136), ఎలక్ట్రీకల్ ఇంజనీర్లు (131), స్పెషలిస్ట డాక్టర్లు (69), పర్సనల్ ఆఫీసర్లు (58), ఫైనాన్స్ అధికారులు (32), సివిల్ అధికారులు (10) తదితర ఉద్యోగాలు కల్పించారు.
కారుణ్య, వారసత్వ ద్వారా 12,553 మందికి ఉద్యోగాలు
తెలంగాణ రాకపూర్వం నాటి ప్రభుత్వాల చిన్నచూపు కారణంగా సింగరేణి సంస్థ ఆశించినంత అభివృద్ధిని సాధించలేకపోయింది. ఉద్యోగుల సంఖ్య కూడా లక్ష నుండి 50 వేలకు పడిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రే సింగరేణిపై ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ, సంస్థ అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి అనేక పథకాలు ప్రకటించారు.
కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను అమలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ ద్వారా 2014 నుండి ఇప్పటి వరకూ 85 మెడికల్ బోర్డులు నిర్వహించి, అన్ ఫిట్ అయిన కార్మికుల స్థానంలో 12,553 మంది వారసులకు ఉద్యోగాలను కల్పించడం జరిగింది. దీంతో సింగరేణి నేడు యువశక్తిని నింపుకొని నూతనోత్తేజంతో ముందుకు ఉరుకుతోంది.
ఇంటర్నల్ రిక్రూట్ మెంట్ ద్వారా 2,909 మందికి ఉద్యోగాలు
కారుణ్య, వారసత్వ నియమకాల ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతలో కొందరు వివిధ రకాల విద్యార్హతలు కలిగి ఉన్నారు. అలాగే సాధారణ కార్మికుల్లో కూడా అదనపు విద్యార్హతలు గల వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలో ఏర్పడే కొత్త ఖాళీలను అర్హులైన ఇంటర్నల్ అభ్యర్ధులతో భర్తీ చేయాలని నిర్ణయించి సింగరేణి సంస్థ 2014 నుండి ఇప్పటివరకూ మొత్తం 2,909 మంది అర్హులైన ఇంటర్నల్ అభ్యర్ధులకు వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను కల్పించింది.
నియామకాలు ఇకపై కూడా కొనసాగుతాయి : సీఅండ్ఎండి శ్రీధర్
సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రగతి పథంలో దూసుకుపోతోందనీ, అనేక సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఎక్స్ టర్నల్ రిక్రూట్ మెంట్ మరియు కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటివరకూ 16,040 కొత్త ఉద్యోగాలు కల్పించామనీ సీఅండ్ఎండి శ్రీధర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంస్థలోని ఖాళీలను కొత్త నియమాకాల ద్వారా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామనీ, కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ ద్వారా ప్రతీ నెల సగటున 250 మంది వారసులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. సింగరేణిలో ఎక్స్ టర్నల్, వారసత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఇకముందు కూడా ఇలానే కొనసాగిస్తామని ఆయన తెలిపారు.