TV9కి మురళీకృష్ణ రాజీనామా..
ప్రముఖ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ టీవీ9కి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారాయన. ‘డియర్ ఆల్ బిగ్ న్యూస్ టీవీ9కి నేను రాజీనామా చేశాను. ఈ రోజే అఫీషియల్‌గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా.. తదుపరి ప్రయాణం త్వరలో..’ అంటూ ట్వీట్ చేశారు మురళీకృష్ణ. టీవీ 9 లో మురళీకృష్ణ ఎన్కౌంటర్ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. ఆ ఛానల్లో ఉన్న మిగతా యాంకర్ల మాదిరిగా సన్సేషనలిజమ్ జోలికి పెద్దగా పోకుండా సౌమ్యంగా ప్రశ్నలు వేస్తారనే పేరు ఇతనికి ఉంది. అతి చేయకుండా వార్తని వార్తలా చదువుతూ మంచి పేరే సంపాదించారు మురళీకృష్ణ. ఆయన ఎన్టీవీ ఛానల్లో కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎన్టీవీ నుంచి సాక్షికి వెళ్లిన తరువాత ఆ ఛానల్లో పొలిటికల్ డిబేట్స్ నిర్వహించడానికి సమర్ధవంతమైన యాంకర్ లేరనే చెప్పాలి. దీంతో మురళీకృష్ణ ఎన్టీవీలో అడుగుపెడితే ఆ లోటు తీరినట్టే. టీవీ 9 ఛానల్ జర్నలిస్ట్ కెరియర్ స్టార్ట్ చేసిన మురళి.. మధ్యలో కొంతకాలం సాక్షికి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని. ఆ సాన్నిహిత్యం తోనే సాక్షిలోకి వెళ్లారనే ప్రచారం ఉంది. 2014 సాధారణ ఎన్నికల తరువాత మళ్లీ టీవీ 9కి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ టీవీ9లో వివిధ హోదాలలో పనిచేసి చివరికి ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చేశారు.