317 జీవోపై స్టేకి హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: 317 జీవోపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 317 జీవోపై స్టే విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.అయితే ఈ విషయమై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఆర్టికల్ 371 డిని పార్లమెంట్ ఆమోదించకుండా 317 జీవో ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 317 జీవోపై స్టే ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య కోరారు. అయితే 317 జీవోపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వవరణ తీసుకొన్న తర్వాత 317 జీవోపై నిర్ణయం తీసుకొంటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
317 జీవో ఏం చెబుతుంది..
మన రాష్ట్రంలో ఉద్యోగాలు జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్లుగా విభజించారు. టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. గతంలో జిల్లాల విభజనకు పూర్వం టీచర్ ఉద్యోగాలను సర్కార్ భర్తీ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆ ఉద్యోగాలను కొత్త జిల్లాల వారీగా కేటాయిస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఒకే ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాలు వేరే ఉమ్మడి జిల్లాల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులను జిల్లాల వారీగా కేటాయిస్తున్న సమయంలో సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుంది. దీంతో సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. దీంతో గత రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీనియర్ టీచర్లకు పట్టణ ప్రాంతాలకు ఎంపిక చేసుకొంటున్నారు. అయితే జూనియర్ టీచర్లు ఆయా జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను ఎంచుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాదు సుమారు 25 వేల మంది టీచర్లు తమ స్థానికతను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఉపాధ్యాయసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతం కాకపోయినా.. కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని జూనియర్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా ఏర్పడిన ఖాళీల ఆధారంగానే భర్తీ చేస్తూ ఉంటారు. దీంతో ఆ మారుమూల ప్రాంతాల్లో ఇప్పట్లో ఖాళీలు ఏర్పడే అవకాశమే ఉండదని నిరుద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల కేటాయింపునకు ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం హేతుబద్ధంగా లేదని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ విషయమై రెండు రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలు చలో సెక్రటేరియట్ ను నిర్వహించాయి. సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.317 జీవోను సవరించాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ విషయమై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ జీవోతో జూనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహలో ఉద్యోగులకు అన్యాయం జరగడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.