చర్చలతో ముందుకు…
కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు - పలు అంశాలపై అభిప్రాయాలు కొలిక్కి
మంచిర్యాల : హైదరాబాదులో సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిదులతో నిర్వహించిన చర్చల్లో పురోగతి కనిపించింది. తమ సమస్యల సాధనకు డిసెంబర్ 9,10,11 తేదీల్లో కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. 12 డిమాండ్లతో సమ్మె చేయడంతో వాటిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా శనివారం సింగరేణి, కార్మిక సంఘ ప్రతినిధులు చర్చించారు.
1. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, కమర్షియల్ మైనింగ్ పై సింగరేణి యాజమాన్యం, యూనియన్ ప్రతినిధులతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలవటానికి వారం రోజుల్లో యజమాన్యం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి కార్మిక సంఘ నేతలు అంగీకారం తెలిపారు.
2. కాంట్రాక్ట్ కార్మికులు కోవిడ్ తో చనిపోయిన వారికి 15 లక్షలు కంపెనీ ఇవ్వటానికి, ప్రమాదంలో చనిపోయిన వారికి కాంట్రాక్టర్ ద్వారా కార్మికుల కుటుంబాలకు చెల్లించడానికి సానుకూలంగా స్పందించారు.
3.మారు పేర్ల విషయంలో సైతం చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మార్పు చేసుకున్న వారికి మార్చేందుకు అంగీకారం తెలిపారు.
4. పేర్లలో చిన్న చిన్న తప్పులను వెంటనే సరి చేసి వారసులకు ఉద్యోగం కల్పించేందుకు అంగీకారం తెలిపారు. పేర్ల లో పూర్తి మార్పు లు ఉంటే ఎంక్వైరీ కమిటీ వేసి సవరించడానికి మగీకరించింది.
6.భార్య భర్తలు ఉద్యోగులైతే లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకపోతే వారి డిపెండెంట్ లకు కూడా ఉద్యోగం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
7. డిపెండెంట్ ఉద్యోగాలకు వయస్సు 35 సం.రాల నుంచి 40 సంవత్సరాలు గా పెంచటానికి అంగీకారం తెలిపారు.
ఈ అంశాలు అన్నింటికి సంబంధించి ఆర్ ఎల్ సీ ముందు రాత పూర్వక అగ్రిమెంట్ కోసం మరో రోజు కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్మికుడు ప్రమాదంలో చనిపోతే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, పెర్క్, ఇన్‌కంటాక్స్, సొంతి ఇంటి కల డిమాండ్ కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలపై ఎలాంటి అంగీకారానికి రాలేదు. ఆర్ఎల్‌సీ దగర 12(3) అగ్రిమెంట్ జరిగే వరకూ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు గా మాత్రమే భావించాలని కార్మిక సంఘ నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.