మళ్లీ ఆంధ్రోళ్లదే ఆధిపత్యం
ఆంధ్ర, స్థానికేతరులదే ఇక్కడ రాజ్యం - అర్హులకు అన్యాయం జరుగుతోందని వాపోతున్న అధికారులు, కార్మికులు
స్థానిక పాలన కావాలని, స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమానికి మద్దతుగా నిలిచి నిప్పు రాజేసింది సింగరేణి. ఆంధ్రా పాలకులు, అధికారుల అహంకారంతో కార్మికులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. దీంతో మా పాలన మాకేనని గొంతెత్తి ఉద్యమంలో ముందుండి నడిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సాకారమయ్యాక సింగరేణిలో కొద్ది రోజులు తెలంగాణ అధికారులు, కార్మికులకు న్యాయం జరిగింది. కానీ మళ్లీ ఆ సంస్థలో ఆంధ్ర అధికారులు, స్థానికేతరులదే ఇష్టారాజ్యంగా సాగుతోంది.
సింగరేణిలో మళ్లీ ఆంధ్ర అధికారుల రాజ్యం సాగుతోంది. గతంలో ఏ విధంగా అయితే తమ వాళ్లను నియమించుకుని తెలంగాణ అధికారులు, కార్మికులను ఇబ్బందులకు గురి చేశారో అదే విధంగా మళ్లీ ఇక్కడి ప్రాంత వాసులను ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాక తెలంగాణ ప్రాంత అధికారులు, కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ లక్షల రూపాయల జీతం ఇచ్చి మరీ ఆంధ్ర, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సింగరేణిలో అధికారులకు అర్హత ఉన్నా వారిని కాదని మరీ అక్కడ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
డైరెక్టర్ల స్థాయి మొదలుకుని అడైజర్లలో చాలా మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇందులో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్ అందరూ ఆంధ్రాప్రాంతానికి చెందిన వారే. ఇక అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్ సైతం స్థానికేతరులే. ఇలా అక్కడ నుంచి తెచ్చుకుని కార్మికుల నెత్తిన రుద్దాల్సిన అవసరం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆంధ్రాప్రాంతానికి చెందిన కొందరు అధికారులు కావాలనే అక్కడి వాళ్లను తెచ్చి పెట్టారని చెబుతున్నారు.
ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులు తమకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అర్హత ఉన్నా వేరే వారిని తీసుకురావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కావాలనే కొందరు ఆంధ్ర అధికారులు అక్కడి వారిని తీసుకువచ్చారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే స్థానికేతరులను వెళ్లగొట్టాలని, స్థానికులకు న్యాయం జరగాలని మరి అలా కాకుండా తిరిగి ఆంధ్రా ఆధిపత్యం కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆంధ్రా ఆధిపత్యానికి ఎప్పుడు కాలం చెల్లుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో ముఖ్యమంత్రి కలుగచేసుకుని ఆంధ్ర అధికారుల పెత్తనం వదిలించేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.