జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసుల షాక్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు.
అయితే జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని స్వయంగా డీసీపీ చందన దీప్తి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని డీసీపీ స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈనెల 10 వరకు తెలంగాణలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఆమె తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా 14రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. పధ్నాలుగు రోజుల పాటు రాష్ట్ర నాయకులతో పాటు… రోజుకొక కేంద్ర మంత్రి కానీ… జాతీయ నాయకుడు కానీ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.