లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు రవాణా
సింగరేణి ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లకు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ఆదేశం
సింగరేణిలో లక్ష్యాల మేరకు బొగ్గు ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లు తగినన్ని లారీలతో బొగ్గు రవాణా చేయాలని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, పిఅండ్పి, పర్సనల్) ఎన్.బలరామ్ కోల్ ట్రాన్స్ పోర్టర్లను కోరారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జీఎం (కో ఆర్డినేషన్) సూర్యనారాయణ, జీఎం (మార్కెటింగ్) కె.రవిశంకర్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో ఉన్న 43 మంది కోల్ కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో రోజుకు రెండు లక్షల ఇరవై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరపాలని నిర్ణయించామన్నారు. దీనికి అనుగుణంగా గనుల నుంచి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు, పవర్ ప్లాంట్లకు లారీలను ఏర్పాటు చేసుకొని బొగ్గు రవాణా సజావుగా నిర్వహించాలని డైరెక్టర్లు ఆదేశించారు.
విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి నుంచి బొగ్గు రవాణా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీనికి అనుగుణంగా ట్రాన్స్ పోర్టు యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డీజిల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ట్రాన్స్ పోర్టర్ల అభ్యర్థన మేరకు కంపెనీ కాంట్రాక్టు నిబంధనల్లో కొంత సడలింపు వర్తింపచేశామన్నారు. కంపెనీ అందిస్తున్న సహకారాన్ని దృష్టి లో ఉంచుకొని బొగ్గు రవాణాకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ విషయంలో అలసత్వం చూపిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర బొగ్గు అవసరాలను తీర్చడంలో ట్రాన్స్ పోర్టు యజమాన్యాలు కూడా తమవంతు బాధ్యతగా సేవలు అందించాలని కోరారు.
సమస్యలు ఏమైనా ఉంటే ఏరియా జీఎంల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. బొగ్గు రవాణాకు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 600 లారీల ద్వారా బొగ్గు రవాణా జరుగుతోందని వెల్లడించారు. ఇటువంటి బొగ్గు రవాణా సమయంలో పర్యావరణ హిత చర్యలతో పాటు ప్రమాదరహితంగా రవాణా సాగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లు తమ సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. డైరెక్టర్లు స్పందిస్తూ వాటి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని ఏరియా జీఎంలకు ఆదేశాలిచ్చారు. సమీక్షా సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జీఎం(సీపీపీ) నాగభూషణ్ రెడ్డి, జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, జీఎం(సీఎంసీ) రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.