కొత్త గనులు త్వరగా ప్రారంభించాలి
సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్
కొత్త గనులను త్వరగా ప్రారంభించాలని సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ కోరారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో రానున్న కాలంలో ప్రారంభించనున్న 15 గనులకు సంబంధించి ప్రణాళికలు, అనుమతులపై సంస్థ ఆయన మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఏడాది ఒడిశా లోని నైనీ బొగ్గు బ్లాక్, జీడీకే ఓపెన్ కాస్టు, వీకే ఓపెన్ కాస్టు గనుల ప్రారంభానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నైనీ బ్లాక్ నుంచి ఏప్రిల్ నెలలో ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. అలాగే పెనగడప ఓసీ, రొంపెడు ఓపెన్ కాస్టు, న్యూ పాత్రపాద తదితర గనులకు సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది సింగరేణి 68 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలన్నారు. తర్వాతి సంవత్సరాల్లో క్రమంగా ఉత్పత్తి పెంచుతూ రానున్న ఐదేళ్ల లో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకునేలా కొత్త బ్లాక్ లకు అనుమతులు సాధించేలా ముందుకు పోవాలని సూచించారు. ఈ సమీక్ష లో కొత్త గనులకు సంబంధించి ప్రణాళికలు, అనుమతులు, భూ సేకరణ, లాభదాయకత వంటి అంశాలపై ఉన్నతాధికారులు వివరించారు.
సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, పి అండ్ పి, పర్సనల్) బలరామ్, డైరెక్టర్ (ఇఅండ్‌ఎం) సత్యనారాయణరావు, అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్, సురేంద్ర పాండే, ఈడీ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జీఎం (కోఆర్డినేషన్) సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) నాగభూషణ్‌రెడ్డి, జీఎం (మార్కెటింగ్) కె.రవిశంకర్, జీఎం (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) పి.సత్తయ్య, జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్ తదితరులు పాల్గొన్నారు.