ప్రపంచంలోనే అత్యద్భుత పథకం రైతుబంధు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల : రైతుబంధు పథకం ప్రపంచలోనే అత్యద్భుత పథకమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. మంగళవారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు సమన్వయ కమిటీలు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి కాని ఆలోచించని స్థాయిలో రైతుబంధు పథకం తీసుకువచ్చారని చెప్పారు. రైతు బంధు ప్రారంభమైనప్పటి నుంచి రైతుల్లో ఎనలేని సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఇది ఒక గొప్ప ఊతంగా మారిందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నుంచి చిన్న సాగునీటి వనరులైన చెరువుల బలోపేతం వరకు, రైతుబంధు, రైతు బీమా నుంచి రైతు వేదికల వరకు ఎవరు కనివిని ఎరుగని గొప్ప కార్యక్రమాలను కెసిఆర్ చేశారని వెల్లడించారు. ఏక కాలంలో అత్యధిక మందికి ఉపాధి ఇయ్యగలిగే వ్యవసాయ రంగాన్ని ఎంత పటిష్టం చేస్తే అంత మంచిదని కెసిఆర్ గారు దూరదృష్టి, దార్శనికతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. త్వరలోనే కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. రైతుబంధు అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో మనమంతాపండగ వాతావరణంలో సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రైతుబంధు సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కోరారు.
1) రానున్న సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా… మహిళా లోకాన్ని కలుపుకొని పోయేలా కార్యక్రమాలు నిర్వహించాలి.
2) విద్యార్థుల్లో రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలి. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలి.
3) ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపులతో మొదలుపెట్టి రైతు వేదికల వద్ద పండగ వాతావరణంలో జనవరి 10వ తేదీన ఘనంగా ముగింపు సంబరాలు చేయాలి. రైతు వేదికని అందంగా ముస్తాబు చేయాలి.
4) తాము నిర్వహించే ఈ సంబరాలకు స్థానికంగా ఉన్న పత్రికలు, స్థానిక టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాల్లో సరైన ప్రచారం వచ్చేలా సమన్వయం చేసుకోవాలి. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి.
5) మన నియోజకవర్గ, మండల స్థాయి, రైతులకు అందిన నిధుల వివరాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయాలి.
6) రైతుబంధు ఆవశ్యకతను తెలిసేలా ఊరు వాడల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి.
7) వీలైతే పంటపొలాలు, తోటల్లో నాయకులు రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
8) సింగరేణి కార్మికులు చాలామంది రైతు బంధు ద్వారా లబ్ది పొందుతున్న నేపథ్యంలో గనులపై కూడా సంబరాలు చేసుకోవచ్చు.
9) రైతు సమన్వయ కమిటీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు సమన్వయంతో కలసికట్టుగా పని చేసి సంబరాలు జరిగేలా బాధ్యతలు తీసుకోవాలి.
10) మన నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు మున్సిపాలిటీలలో అద్భుతంగా సంబరాలు నిర్వహించిన టీం కు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తానని స్పష్టం చేశారు.