వంద కేసీఆర్ గ్రంథాలయాలు
ఒక్కో దానికి నాలుగు లక్షలు - మొత్తం నాలుగు కోట్లతో ఏర్పాటు - నిరుద్యోగులు, ఉద్యోగులకు ఎంతో మేలు : విప్ బాల్క సుమన్
మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గం మొత్తంగా 100 గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రణాళికలు రూపొందించారు. నియోజకవర్గం అంతటా 100 గ్రంథాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ఏర్పాటు చేసేందుకు ఆయన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో గ్రంథాలయానికి నాలుగు లక్షల రూపాయలు కేటాయించనున్నారు. మొత్తం నాలుగు కోట్ల రూపాయలతో ఇవన్నీ పూర్తి కానున్నాయి. దానిలో భాగంగా మంగళవారం గ్రంథాలయం డిజైన్ సంబంధించి తుది రూపు ఇచ్చారు. విప్ బాల్క సుమన్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ రేణికుంట్ల ప్రవీణ్ సైతం ఈ ప్రణాళిక సిద్ధం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసే ఈ గ్రంథాలయాలు నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని బాల్క సుమన్ స్పష్టం చేశారు.