కరోనా పరీక్షలు అవసరం లేదు
హోం ఐసోలేషన్ ఏడు రోజులే - కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదివరకు పది రోజులుగా ఉన్న హోం ఐసోలేషన్‌ను 7 రోజులకు కుదించింది. లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారు.. పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే 7 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండవచ్చు. హోం ఐసోలేషన్ ముగిసిన తర్వాత మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంలేదు.
హోం ఐసోలేషన్‌కు అర్హులు ఎవరు:
హోం ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తికి తేలికపాటి లక్షణాలు ఉన్నా.. ఎలాంటి జ్వరం ఉండకూడదు. బాధితుల ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు అయితే వారు స్వీయ నిర్బంధానికి అర్హులు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి దగ్గరలోని ప్రభుత్వ వైద్యాధికారి ధ్రువీకరిణ (తేలికపాటి లక్షణాలు ఉన్నాయని) పత్రం తీసుకోవాలి. ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తితో పాటు కుటుంబం క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. సదరు వ్యక్తికి కొవిడ్-19 వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయి ఉండాలి. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగస్థులు.. సంబంధిత మెడికల్ అధికారి సలహా మేరకే హోం ఐసోలేషన్‌లో ఉండాలి.