భార్యను పంపించమన్నాడు
భర్తగా భరించలేకపోయాను - పాల్వంచలో నాగరామకృష్ణ సూసైడ్ కేసు మరో మలుపు - ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవకు బిగుస్తున్న ఉచ్చు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : న్యాయం కోసం తన వద్దకు వెళ్లాను… వనమా రాఘవ నీ భార్యను పంపిస్తే న్యాయం చేస్తామన్నాడు.. భర్తగా భరించలేకపోయాను.. ఇదీ పాల్వంచలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నాగరామకృష్ణ ఆవేదన. ఆయన సెల్ఫీ వీడియో చెప్పిన విషయాలు అన్నీ కలకలం సృష్టిస్తున్నాయి.
పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రామకృష్ణ తనతో పాటు భార్య శ్రీలక్ష్మి, పిల్లలు సాహిత్య, సాహితీలపై సోమవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో తొలుత పెట్రోల్ చల్లాడు. ఆ తర్వాత గ్యాస్ లీకేజీ చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య అక్కడిక క్కడే మృతిచెందగా మరో కూతురు సాహితీ మృత్యువుతో పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచింది.
రామకృష్ణ మీ సేవా కేంద్రం నిర్వహించేవాడు. రూ.35 లక్షల వరకు అప్పు అయింది. రుణ దాతల నుండి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. వారసత్వంగా తనకు సంక్రమించే ఆస్తికోసం తల్లిని ఆశ్రయించాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో మీ సేవా కేంద్రాన్ని విక్రయించి మరో వ్యాపారం చేసుకునేందుకు 3 నెలల క్రితం కుటుంబంతో రాజముండ్రి వెళ్లాడు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ఆస్తి తగాదాలో రాజకీయ జోక్యం పెరిగింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావు గురిచేసిన మానసిక క్షోభతో మూకుమ్మడి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. న్యాయం కోసం వెళ్తే.. రాఘవ తన భార్యను పంపిస్తే న్యాయం చేస్తామని భర్తగా భరించలేకపోయానని ఆవేదన వ్యక్తంచే పేర్కొన్నాడని వాపోయాడు. రాఘవను కఠినంగా శిక్షించాలని వీడియోలో కోరాడు.