రూ. 1,070 కోట్ల లాభాలు
19 వేల కోట్ల రూపాయల అమ్మకాలు - గత ఏడాదిపై లాభాలలో 227 శాతం వృద్ధి - అమ్మకాలలో 58 శాతం వృద్ధి - ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో గణనీయ వృద్ధితో సింగరేణి - సీఅండ్ఎండీ శ్రీధర్
సింగరేణి ప్రతినిధి : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు త్రెమాసికాలకు కలిపి రికార్డు స్థాయిలో 1,070 కోట్ల రూపాయల లాభాలు (ప్రాఫిట్ బిఫోర్ టాక్స్) గడిరచింది. గత ఏడాది ఇదే కాలానికి 842 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన సింగరేణి ఈ ఏడాది తన అద్భుతమైన టర్నోవర్ ఫలితంగా లాభాల్లో 227 శాతం వృద్ధిని రికార్డు చేసింది. కాగా గత ఏడాది తొలి 9 నెలల్లో బొగ్గు, విద్యుత్తు కలిపి 11,986 కోట్ల అమ్మకాలు జరిపగా ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకు 58 శాతం వృద్ధితో 19 వేల కోట్ల రూపాయల అమ్మకాలను నమోదు చేసింది.
గత ఏడాది బొగ్గు ద్వారా 9,525 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపిన కంపెనీ ఈ ఏడాది కరోనా పరిస్థితులను అధిగమించి ఉత్పత్తి, రవాణాలను గణనీయంగా పెంచుకోవడం ద్వారా 69 శాతం వృద్ధితో 16,110 కోట్ల రూపాయల అమ్మకాలు సాధించింది. గత ఏడాది తొలి 9 నెలల్లో 318 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన కంపెనీ ఈ ఏడాది 52 శాతం వృద్ధితో 484 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది.
మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా గత ఏడాది కన్నా మెరుగైనరీతిలో అమ్మకాలు సాధించింది. గత ఏడాది తొలి మూడు త్రైమాసికాలకు కలిపి 5,353 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పాదన చేయగా, ఈ ఏడాది తొలి 9 నెలల్లో 30 శాతం వృద్ధితో 6,904 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దీంతో గత ఏడాది సాధించిన 2,461 కోట్ల రూపాయల అమ్మకాలపై 17 శాతం వృద్ధితో ఈ ఏడాది 9 నెలల్లో 2,892 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది.
మిగిలిన మూడు నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు, లాభాలు : సి అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్
ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో అమ్మకాలు, లాభాల్లో సింగరేణి గణనీయమైన వృద్ధిని నమోదు చేయడంపై సి అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు, ఉద్యోగులకు తన అభినందనలు తెలిపారు. విద్యుత్ వినియోగం పెరగనున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్తు ఉత్పాదన కూడా పెంచాలన్నారు. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 27 వేల కోట్ల రూపాయల మేర టర్నోవర్, రికార్డు స్థాయి లాభాలు గడిరచే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ఏరియాల్లో పూర్తి స్థాయి యంత్ర వినియోగంతో రోజువారీగా, గనుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు, కార్మికులు అంకిత భావంతో పని చేయాలని కోరారు.