ఆన్‌లైన్‌లో నామినేషన్లు
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల షెడ్యూలు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఎన్నికలను కోవిడ్ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో కోవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో చర్చించినట్లు తెలిపారు.
ఈ ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నవారు 24.9 లక్షల మంది అని తెలిపారు. 11.4 లక్షల మంది మహిళలు తొలిసారి ఓటు వేయబోతున్నట్లుతెలిపారు.
16 శాతం పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు. మొత్తం పోలింగ్ బూత్‌ల సంఖ్య 2.16 లక్షలు అని తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు ఓటర్ల సంఖ్యను 1,250కి తగ్గించినట్లు చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు.
కోవిడ్ పాజిటివ్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయవచ్చునని తెలిపారు.
ఏడు విడతల్లో పోలింగ్
మొదటి విడత – ఫిబ్రవరి 10
రెండో విడత – ఫిబ్రవరి 14
మూడవ విడత – ఫిబ్రవరి 20
నాలుగో విడత – ఫిబ్రవరి 23
ఐదవ విడత – ఫిబ్రవరి 27
ఆరవ విడత – మార్చి 03
ఏడవ విడత – మార్చి 07
అన్ని రాష్ట్రల్లో మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు