నిశ్చితార్థం రోజే ఆత్మహత్య
నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం ఖమ్మంలో కలకలం సృష్టించింది. నగరంలోని ఓ లాడ్జిలో కానిస్టేబుల్ అశోక్ కుమార్(29) మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురానికి చెందిన అశోక్ కుమార్ 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. ఇటీవల జరిగిన పోలీస్ శాఖ బదిలీల్లో ఇతను ములుగు జిల్లాకు బదిలీ అయ్యారు. నిన్న రాత్రి అక్కడి నుంచి ఖమ్మం వచ్చిన అశోక్ ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఉదయం లాడ్జి సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లి అశోక్ ఉంటున్న తలుపు ఎంత సేపు తట్టినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి లాడ్జి నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపు పగులగొట్టి చూడగా కానిస్టేబుల్ విగతజీవిగా కనిపించారు. ఇవాళ నిశ్చితార్థం ఉన్నా అశోక్ ఇంటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఏమైందో తెలుసుకుందామని కుమారుడితో ఫోన్ లో మాట్లాడటానికి వారు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంతలో కుమారుడు చనిపోయాడని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ములుగు జిల్లాకు బదిలీ విషయంలో కొంత అసహనంతో పాటు నిశ్చితార్థం ఇష్టం లేకే అశోక్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. *ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.