మహిళా పక్షపాతి ప్రభుత్వం
ప్రతి గ్రామానికి సమ్మక్క-సారలమ్మ మహిళా భవనాలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెల్లడి
మంచిర్యాల : మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆయన చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెర్ప్ & మెప్మా కార్యకలాపాలపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. సుమారు 15 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామాల్లో మహిళా భవన్ లను నిర్మిస్తున్నామన్నారు. తొలి విడతలో భాగంగా 36 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలలో మహిళ భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొద్ది రోజులలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి వీటి నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. మహిళా భవన్లు పూర్తయిన తర్వాత ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారితో మహిళలకు శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న సెర్ప్ & మెప్మా సభ్యుల సేవలను బాల్క సుమన్ ప్రశంసించారు. రాష్ట్రంలో స్వశక్తితో ఎదిగిన మహిళల వద్దకి గ్రూప్ సభ్యులను తీసుకెళ్తామన్నారు. వారి విజయగాథలను వివరించి మహిళల్లో మనోధైర్యాన్ని నింపేలా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను తమ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. చెన్నూరు నియోజకవర్గ మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మహిళా అభ్యున్నతిలో రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా చెన్నూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న డీఆర్‌డీవో శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మిషన్ భగీరథ ఈఈ అంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.