కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ పర్యటన రద్దయింది. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మంత్రివర్గ సమావేశాల నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై మాట్లాడనున్నారు కేసీఆర్.
అంతకుముందు కేబినెట్ భేటీలో ఉమ్మడి వరంగల్‌లో భారీ వర్షాల వల్ల జరిగిన పంటనష్టాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. దాంతో కేసీఆర్.. తానే స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి జరిగిన పంటనష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్పినట్టు తెలిసింది. అలాగే బాధిత రైతులతో మాట్లాడుతారని, పరిహారం చెల్లింపులో భరోసా ఇచ్చేలా సీఎం పర్యటన ఉంటుందని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా మంత్రివర్గ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉన్నతాధికారులు మాత్రమే పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
అకాల వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 42 వేల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, పసుపు పంటలతోపాటు పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాలతో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 120 కోట్ల మేర పంటనష్టం ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.