26 తర్వాత భవిష్యత్ ఏంటి…?
మంచిర్యాల : మంచో… చెడో… ఆయన పేరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో, నేతల్లో నానుతూ ఉంటుంది. నిత్యం అసమ్మతి నేతగా ఆయనకు ముద్ర ఉంది. పార్టీ పరంగా ఏదో ఒక వివాదంలో ఉండే ఆయన ఇప్పుడు మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ఈ నెల 26 తర్వాత ఆయన భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందరికీ సుపరిచిడుతు. ఎమ్మెల్సీగా ఆయన జిల్లాలో చక్రం తిప్పారు. అయితే ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో అటు పార్టీకి, ఇటు కార్యకర్తలకు ఇబ్బందిగా మారుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి చేపట్టిన తర్వాత తనకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రేంసాగర్ రావు అలిగారు. దీంతో తాను కాంగ్రెస్ పార్టీ వీడుతానని, కొత్త పార్టీ పెడతానని సంచలన ప్రకటన చేశారు. అధిష్టానం ఈ విషయం చాలా తేలికగా తీసుకుంది. దీంతో ప్రేంసాగర్ రావు సైలెంట్ అయ్యారు. ఆయన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు డైలామాలో పడ్డారు. టీఆర్ఎస్ వ్యతిరేకులు సైతం కాంగ్రెస్‌లో చేరాలనుకుని ఆగిపోయారు. ప్రేంసాగర్‌రావు తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చని ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లోకి వెళ్లారు.
ఇక కొద్ది రోజుల కిందట కళ్లాల వద్దకు కాంగ్రెస్ పేరుతో పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హన్మంతరావు తదితర నేతలు హాజరయ్యారు. వారు ఆందోళన నిర్వహించి కలెక్టరేట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ప్రేంసాగర్ రావు అనుచరులు వీహెచ్‌తో సహా పలువురు నేతలను అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పంపితేనే తాను వచ్చానని తనను అడ్డుకోవడం ఏమిటని ప్రేంసాగర్ రావు వర్గంపై అసహనం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
హన్మంతరావు అన్నట్టుగానే సోనియాగాంధీ తదితర నేతలకు లేఖ రాశారు. ఈ నెల 26వ తేదీ వరకు ప్రేంసాగర్ రావుపై చర్యలు తీసుకోకపోతే గాంధీ భవన్ ఎదుట నిరసన దీక్ష చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యదర్శులు వీహెచ్‌తో చర్చలు జరిపారు. బోసు రాజు, శ్రీనివాస్ ఇద్దరూ వెళ్లి ఆయనతో మాట్లాడారు. తాను పార్టీ కార్యక్రమం కోసం వెళితే తనను అడ్డుకోవడం ఏమిటని వీహెచ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇలాంటివి పార్టీలో కొనసాగితే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పినట్లు సమాచారం. ప్రేంసాగర్ రావుకు నోటీసు ఇచ్చి ఆ తర్వాత చర్యలు తీసుకోవడమా..? లేక క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమా…? ఏమిటనే దానిపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతుందో అనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా జిల్లాలో పట్టున్న నేత కావడంతో ప్రేంసాగర్ రావును వదిలేస్తారా..? లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా..? అని పలువురు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఏం చేయాలి అనే విషయంలో ప్రేంసాగర్ రావు సైతం ముఖ్యులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ విషయమై స్పష్టత రానుంది.