అలా ఎలా లాక్కు వస్తారు…?
కరీంనగర్ సీపీపై జాతీయ బీసీ కమిషన్ ఆగ్రహం

ఒక బాధ్యత గల ఎంపీని ఇంట్లో నుంచి బయటకు గుంజుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని కరీంనగర్ సీపీపై జాతీయ జెసీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గురువారం కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేషనల్ బీసీ కమిషన్ ముందు హాజరయ్యారు. ఎంపీ తన కార్యాలయంలో దీక్ష చేసుకుంటుంటే, గ్యాస్ కటర్లు వినియోగించాల్సిన అవసరం ఏంటని జాతీయ బీసీ కమిషన్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. బయట వాళ్ళు ఎవరైనా వస్తే అడ్డుకోవాల్సింది.., కానీ ఎంపీని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కరీంనగర్ లో బండి సంజయ్ 317 జీవో సవరించాలని జాగరణ దీక్ష చేస్తుండగా, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ బండి సంజయ్ ను కరీంనగర్ సీపీ అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా బండి సంజయ్ పట్ల కరీంనగర్ సీపీ దురుసుగా ప్రవర్తించారని నేషనల్ బీసీ కమిషన్ కు బీజేపీ నేతల ఫిర్యాదు చేయడంతో సీపీ సత్యనారాయణ పై విచారణ జరిపారు.