ఈ వైద్యులు… నిజంగా దేవుళ్లు…

వైద్యో నారాయణో హరి: అంటారు. నిజంగానే ఈ వైద్యులు దేవుళ్లు అయ్యారు.. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా ఇద్దరు గర్భిణులకు పురుడు పోశారు. దీంతో ఇప్పుడు వారిని అందరూ పొగుడుతున్నారు.
కరోనా అంటేనే ఆమడదూరం పారిపోతున్న ఈ రోజుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వైద్యులు అందిస్తున్న సేవలను వెలకట్టలేనివని మరోమారు రుజువైంది. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందిస్తూ తమ నిబద్ధతను చాటుకుంటున్నారు వైద్యులు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి పాజిటివ్ అని తెలిసినా ధైర్యంగా ఆమెకు పురుడు పోసి ప్రాణాలు నిలబెట్టారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. హుజూరాబాద్ మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా పరీక్షలు కూడా చేయాలని సిబ్బందికి సూచించారు. ఆమెకు కరోనా అని తేలింది. దీంతో గైనకాలజిస్టు డాక్టర్ వాణీలత, సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎంవో సుధాకర్ రావు కేసును ప్రత్యేకంగా తీసుకుని ఆమెకు పురుడు పోశారు. నార్మల్ డెలివరీ అయ్యేలా చూశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలోనూ కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. కరోనా బాధితురాలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మబాద్ కు చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం భైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. డాక్టర్ పద్మావతి, సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి సాధారణ కాన్పు చేశారు.