రైలు ఆలస్యం.. రూ.1.36 లక్షల పరిహారం
ఓ రైలు ఆలస్యంగా నడిచినందుకు రైల్వే శాఖ ఏకంగా రూ. 1.36 లక్షల పరిహారం చెల్లించింది. వివరాల్లోకి వెళితే.. చలి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వేశాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం అలీగఢ్, ఘజియాబాద్ మధ్య దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఆలస్యానికి కారణమైంది.
షెడ్యూల్ ప్రకారం తేజస్ రైలు లక్నో నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 12:25 గంటలకు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2:19 గంటలకు చేరుకుంది. ఈ రైలులో 544 మంది ప్రయాణికులు ఉండగా.. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం రైల్వేశాఖ వీరందరికీ రూ.250 చొప్పున నష్టపరిహారం చెల్లించింది. దీంతో మొత్తం రూ.1.36 లక్షలను రైల్వేశాఖ అధికారులు పరిహారంగా చెల్లించారు. కాగా తిరుగు ప్రయాణంలోనూ తేజస్ రైలు గంట ఆలస్యంగా ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరి వెళ్లింది.