మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల : పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోకపోగా, తమపైనే కేసు పెడతామని బెదిరించడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఒకరు మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అతను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలకు మేరకు..
మంచిర్యాల జిల్లా నెన్నల మండల కేంద్రానికి చెందిన జంబి బీమక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్నారు. ఈ నెల 13న ఇంటి ముందర కొందరు పిల్లలు గొడవ చేస్తున్నారని మందలించారు. తెల్లవారి ఆ పిల్లల సంబంధీకులు బీమక్కతో గొడవకు దిగారు. బండి రాకేష్, మీనుగు లస్మయ్య అనే వ్యక్తులు వచ్చి బీమక్క, ఆమె కొడుకు ధర్మయ్య మా పిల్లల్ని ఎందుకు తిట్టావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించారు. బీమ్మక్కపై దాడి కూడా చేశారు. దీంతో ధర్మయ్య వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దాదాపు పదిరోజులు గడుస్తున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. శనివారం పోలీస్‌స్టేషన్ వెళ్లిన ధర్మయ్య తన ఫిర్యాదుపై ప్రశ్నించాడు. అయితే పోలీసులు మీ మీద కూడా ఫిర్యాదు వచ్చిందని మీ మీద కూడా కేసు అవుతుందని తేల్చి చెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోకపోగా తమపైనే కేసు నమోదు అవుతుందని చెప్పడంతో ధర్మయ్య మనస్థాపానికి గురయ్యాడు. పైగా కేసు అయితే మీ అమ్మ ఉద్యోగం పోతుందని ఆందోళనకు గురైన ధర్మయ్య ఆదివారం మధ్యాహ్నం మందు తాగాడు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.