టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలబెడతాం

ప్రతి కార్యకర్తను కడుపున పెట్టి చూసుకుంటాం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల: టీఆర్ఎస్ ను జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబెడతామని ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టీఆరెఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ వెల్లడించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కన్న తల్లి లాంటిదని, పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపునిస్తుంది అనడానికి తానే ఉదాహరణ అన్నారు. విద్యార్థి నాయకుడి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలం నుండి టిఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లా మంచిర్యాల జిల్లా అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహచర శాసనసభ్యులు, నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. పార్టీ, ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తానన్నారు కెసిఆర్ నాయకత్వంలో జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడతానన్నారు. గతంలో పెద్దపెల్లి ఎంపీగా చేసిన అనుభవం నాకు కలిసొచ్చే అంశమన్నారు. జిల్లాలో బూత్ స్థాయి నుండి గ్రామ, పట్టణ మున్సిపల్ స్థాయిల వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కడుపున పెట్టుకొని చూసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపునిస్తామన్నారు. యువజన, విద్యార్థి, సోషల్ మీడియా, మహిళా విభాగాల బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందిని చెప్పారు. దానికి అనుగుణంగా ప్రత్యేకంగా యువకులను సన్నద్ధం చేస్తామన్నారు. జిల్లాలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీపరంగా జిల్లాలోని అన్ని కమిటీలను పూర్తిచేసి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైతే శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ వివరాలు తెలుసుకొని, త్వరలోనే నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఇతర పార్టీలు లేవన్నారు. అబద్ధాలతో, దుష్ప్రచారాలతో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే విపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పారు. గతంలో ఉన్నత పదవులు అనుభవించిన విపక్ష నాయకులు ఈ జిల్లాకి ఒరగబెట్టింది ఏమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జిల్లాలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. ప్రజా సంక్షేమ పార్టీ అని బాల్క స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like