కార్మికులకు అండ.. టీబీజీకేఎస్ జెండా..
మంచిర్యాల : కార్మికుల కోసం అహర్నిశలు పనిచేసేది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘమని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా బుధవారం టీబీజీకేఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. శాంతిఖని గనిలో నిర్వహించిన టీబిజికెఎస్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కమీషన్లకు ఆశపడి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఉద్యోగులు, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. సింగరేణి సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్దమయ్యిందన్నారు. మొదటి విడతగా 4 బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి ప్రక్రియ కూడా ప్రారంభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సూచనల మేరకు అందరం ఆందోళన చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేసిందన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ కుట్రను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లిసంపత్, శ్రీనివాస్, గెల్లి రాయలింగు, దాసరి శ్రీనివాస్, బడికల రమేష్ తదితరులు పాల్గొన్నారు …
–