ఎంతటివారైనా ఉపేక్షించవద్దు
సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సమూలంగా డ్రగ్స్ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలన్నారు. సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే డ్రగ్స్ కట్టడి సాధ్యమవుతుందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రగతి భవన్‌లో కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. హోం, అబ్కారీ శాఖ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం సృజనాత్మక కార్యక్రమాలు తేవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ‘‘వెయ్యి మంది సుశిక్షుతులైన సిబ్బందిని నియమించాలి. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి. డ్రగ్స్ నియంత్రించే విభాగం శక్తిమంతంగా పని చేయాలి. అద్భుత పనితీరు కనబరిచే సిబ్బందికి ప్రోత్సాహాకాలివ్వాలి. డ్రగ్స్ కట్టడిలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు. ఏ పార్టీకి చెందిన వారైనా వదిలే ప్రసక్తే లేదు’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నేరస్థుల విషయంలో నాయకుల సిఫారసులు తిరస్కరించాలని తెలిపారు.