ఎవరి పంతం నెగ్గుతుంది…?
-తమ అనుచరుడికి కేటాయించాలని మంత్రి ఐకేరెడ్డి, జోగు ప్రయత్నాలు
-రెండు వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యేలు
-బీసీ లేదా ఎస్సీలకు కేటాయించాలంటున్న డైరెక్టర్లు
-తీవ్ర ఉత్కంఠ రేపుతున్న డీసీసీబీ చైర్మన్ ఎంపిక
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ డీసీసీబీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పంతం నీదా… నాదా అన్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న మద్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. తనకు జిల్లాకు చెందిన అనుచరుడికి చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తెర వెనక చక్ర తిప్పుతున్నారు. ఈ పోరులో నెగ్గేదెవరు..? తగ్గెదెవరు..? మరోవైపు ఎమ్మెల్యేలు సైతం గ్రూపులుగా విడిపోయి తమ వారి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై నాంది ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముందు నుంచి చైర్మన్ పదవిపై కన్నేసిన జోగు రామన్న, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులకు దక్కకుండా అధిష్టానం మాస్టర్ ప్లాన్ వేసి కొత్త వ్యక్తికి కట్టబెట్టింది. ఇది గతం. ఇప్పుడు జోగు రామన్న తన అనుచరుడు అడ్డి బోజారెడ్డికి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సామాజికి వర్గానికి చెందిన రఘునందన్ రెడ్డికి పదవి కట్టబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ కావాలంటే డైరెక్టర్ల మద్దతు ఉండాలి. 20 మంది డైరెక్టర్లలో ఎవరి వైపు మద్దతు ఎక్కువ వారు చైర్మన్ అవుతారు. దీంతో ఎక్కువ మంది మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు గతంలోనే తమకు పదవి కావాలని ఈ రెండు వర్గాలు పట్టుబట్టాయి. అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇటు జోగు రామన్న తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాల మేర ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి కేటాయించేలా అధిష్టానం చర్యలు తీసుకుంది. దీంతో అనూహ్యంగా డీసీసీబీ చైర్మన్‌గా కాంబ్లీ నాందేవ్ ఎన్నికయ్యారు. కాంబ్లీ నాందేవ్ జూలై 28 గుండెపోటుతో మృతి చెందారు. తాత్కాలికంగా నిర్మల్ జిల్లాకు చెందిన రఘునందర్ రెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్నారు.. ఈనెలలో పూర్తి స్థాయి చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫీకేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్న రఘునందన్‌రెడ్డిని పూర్తి స్థాయి చైర్మన్ చేయాలని మంత్రి ఐకే రెడ్డి ప్రయత్నిస్తుండగా, తన అనుచరుడికి ఇవ్వాలని జోగు పట్టుబడుతున్నారు.
ఇక ఈ ఎన్నిక ఎమ్మెల్యే మధ్య చీలిక తీసుకువచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కు చెందిన అడ్డిబోజారెడ్డిని చైర్మన్ చేయాలని జోగురామన్న భావిస్తుండగా ఆయనకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, కోనప్ప మద్దతు చెబుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరుడు రఘునందన్‌రెడ్డికి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మద్దతు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ విప్ బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతున్నారు. దుర్గం రాజేశ్వర్ అనే వ్యక్తికి కేటాయించాలని కోరుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ వారిని గెలిపించుకునేలా వ్యూహాలు పన్నుతున్నారు. మరి ఇందులో ఎవరి వ్యూహం నెగ్గుతుందో చూడాలి.
నేతలు ఇలా ఆలోచిస్తుంటే డీసీసీబీ డైరెక్టర్లు మరో రకంగా ఆలోచిస్తున్నారు. అటు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇటు ఎమ్మెల్యే జోగు రామన్న ఇద్దరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారని కానీ బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన వారికి డీసీసీబీ చైర్మన్ పదవి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు డైరెక్టర్లు ఏకంగా రెండు రోజులు క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. నేతలు వారిని ఫోన్ చేసి రప్పించుకున్నారు. ఇన్ని మలుపుల మధ్య చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో మరి…?