ప్రేంసాగర్ రావుకు షోకాజ్ నోటీసు
మంచిర్యాల : అనుకున్నదంతా అయ్యింది.. చివరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 25న సీనియర్ నేత వి.హన్మంతరావు పర్యటన సందర్భంగా చేసిన ఆందోళన విషయంలో ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఈ నోటీసు జారీ చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కళ్లాల వద్దకు కాంగ్రెస్ పేరుతో పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హన్మంతరావు తదితర నేతలు హాజరయ్యారు. వారు ఆందోళన నిర్వహించి కలెక్టరేట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ప్రేంసాగర్ రావు అనుచరులు వీహెచ్‌తో సహా పలువురు నేతలను అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పంపితేనే తాను వచ్చానని తనను అడ్డుకోవడం ఏమిటని ప్రేంసాగర్ రావు వర్గంపై అసహనం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. హన్మంతరావు అన్నట్టుగానే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు ప్రేంసాగర్ రావుపై చర్యలు తీసుకోకపోతే గాంధీ భవన్ ఎదుట నిరసన దీక్ష చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
ఫలించని రాయబారం..
అయితే ఈ విషయంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు చేసిన రాయబారం ఫలించలేదు. మూడు రోజుల కిందట రాత్రి 10 గంటలకు వీహెచ్ ఇంటికి పీఎస్సార్ వెళ్లారు. ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి రాయబారం చేశారు. ఆగ్రహంతో రగిలిపోయిన వీహెచ్ ప్రేమ్ సాగర్ రావు ను చూడగానే బయటికి నడువు, నా కళ్ళ ముందు కనిపించకు అని వెల్లగొట్టినట్లు సమాచారం. వెంటనే చిన్నారెడ్డి కి చివాట్లు పెట్టి అతన్ని ఎందుకు తీసుకొచ్చావ్? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేక గాంధీ భవన్ ముందు దీక్ష చేయాలా? ప్రశ్నించారు. షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి 24 గంటల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఏం జరుగుతుంది…?
అయితే ఈ షోకాజ్ నోటీసు తర్వాత ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా దీనికి ఆయన ఏం సమాధానం ఇస్తారనేది అందరూ ఆలోచిస్తున్నారు. తప్పు జరిగిందని సమాధానం ఇస్తారా..? లేక మరేం చెబుతారు…? అనే దానిపై అటు కార్యకర్తలు, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.