అవి క్యాష్ ఎలక్షన్లే..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు చేతులు మారింది నిజమే
కలకలం సృష్టిస్తున్న తుడుం దెబ్బ నేతల ఫొటోలు

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారింది నిజమేనని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. కొందరు తుడుం దెబ్బ నేతలు డబ్బులు తీసుకుంటున్న ఫొటోలు బయటపడటంతో అన్ని పార్టీల్లో గుబులు రేగుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ పెద్ద ఎత్తున ఖర్చు చేసిందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు బరిలో ఉన్న అభ్యర్థులు, వారి వెనక ఉన్న నేతలకు సైతం డబ్బులు ముట్టచెప్పారు. ఎక్కడికక్కడ డబ్బులు అప్పగించి వారి నామినేషన్లు విత్ డ్రా చేయించారు. దీంతో డబ్బులు తీసుకుని చాలా మంది సైలెంట్ అయ్యారు. తన పర బేధం లేకుండా మరీ డబ్బులు వసూలు చేసుకున్నారు. ఈ విషయంలో పెద్ద పార్టీలతో సహా అందరికి ముట్టాయి.
ఒకరిద్దరు మినహా చాలా మంది నేతలు డబ్బులు డిమాండ్ చేసి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వ్యక్తులు వారి వెనక ఉన్న నేతలను బట్టి ఒక్కొక్కరికి పది నుంచి ఇరవై లక్షల వరకు పంపిణీ చేసినట్లు ఆ పార్టీకి చెందిన నేతలే ఆరోపించారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. ఒకరిద్దరు నేతలు తమ అనుచరుల పేరు చెప్పి కోట్లు వెనకేసున్నారని బాహాటంగా ఆరోపణలు వినిపించాయి. పశ్చిమ జిల్లాకు చెందిన నేత ఒకరు కోటి రూపాయలు దాకా వెనకేసుకున్నట్లు ఆ పార్టీ నేతలే ఆరోపించారు. సోషల్ మీడియాలో ఆ నేత సొంత పార్టీ వారే విమర్శలు గుప్పించారు. తూర్పుజిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పే ఒక ప్రతిపక్ష పార్టీ నేత సైతం అనుచరుల చేత నామినేషన్లు వేయించి, వారందరినీ గంప గుంతగా మాట్లాడుకుని నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంట్లో సైతం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. చివరికి అధికార పార్టీకి చెందిన నేతలు సైతం ఇందులో డబ్బులు దండుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుంటున్న ఫొటోల్లో కొన్నిబయటకు రావడంతో కలకలం మొదలైంది. తమ వాళ్లు డబ్బులు తీసుకున్నారని వారిని తుడుం దెబ్బ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ప్రెస్మీట్లో డబ్బులు కట్టలు తీసుకుంటున్న తుడుం దెబ్బ నేతల ఫొటోలు బయటపెట్టారు. మా నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లాధ్యక్షుడు గొడాం గణేష్, ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసీ మహిళా కమిటి జిల్లాధ్యక్షురాలు గొడాంరేణుక, ప్రధానకార్యదర్శి పెందోర్ పుష్పారాణి అధికార పార్టీ అభ్యర్థికి అమ్ముడుపోయారనేది తమ విచారణలో ఆధారాలతో సహా తేలిందని, వారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదంతా సరే.. అసలు ఈ ఫొటోలు బయటకు ఎలా వచ్చాయనేది మిస్టరీగా మారింది. డబ్బులు తీసుకుంటున్నది తుడుం దెబ్బ నాయకులు. ఇచ్చేది ఎవరో ఇందులో కనిపించడం లేదు. అది ఖచ్చితంగా అధికార పార్టీకి చెందిన నాయకులే అయి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ఫొటోలు ఎవరు లీక్ చేశారు… అనేది అంతుపట్టడం లేదు. పైగా వారి వద్ద ఈ ఫొటోలే కాకుండా, డబ్బులు తీసుకున్న అందరి ఫొటోలు ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో అందరిలో గుబులు పట్టుకుంది. అవసరం వచ్చినప్పుడు ఆ ఫొటోలు కూడా బయటకు వస్తాయనే చర్చ సాగుతోంది.