ఊ అంటారా…? ఊహూ అంటారా..?
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ వ్యవహారంపై ఉత్కంఠ
మంచిర్యాల : కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ వ్యవహారం కాకరేపుతోంది. సీనియర్ నేత వీహెచ్ పట్టుబట్టడంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే తెల్లవారరే ఆయన ఇంటికి పీసీసీ అధ్యక్షుడు రావడంతో ఆయనపై చర్యలు ఉండవని అంతా భావిస్తున్నారు. మరి ఈ విషయంలో వీహెచ్ ఎలా స్పందిస్తారు…? ఇప్పుడు ఏం జరగబోతోంది అనే విషయమై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
జిల్లాలో వీహెచ్ పర్యటనలో జరిగిన గొడవకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ప్రేంసాగర్ రావు ఈ విషయం పట్ల వీహెచ్‌కు వివరణ ఇచ్చేందుకు వెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. నోటీసులు జారీ చేయాల్సిందే అని వీహెచ్ పట్టుపట్టడంతో ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది.
అయితే తెల్లవారే (శనివారం) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రేంసాగర్ రావు ఇంటికి రావడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లే అని భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి నాగోబా జాతరకు వెళ్తున్న సమయంలో మంచిర్యాల వచ్చారు. అటు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేవంత్ ప్రేంసాగర్ రావు ఇంటికి వస్తారా..? లేదా..? అన్న సందిగ్థత నెలకొంది. ఎట్టకేలకు ఆయన రావడంతో ప్రేంసాగర్ అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన రాకపోతే ఖచ్చితంగా వివాదం చాలా పెద్దదిగా అందరూ భావించేవారు. అలా జరగ్గకపోవడం తమ నేతకు ఎలాంటి ఇబ్బందిలేదని చెబుతున్నారు.
ఇక ఈ విషయంలో సీనియర్ నేత వీ. హన్మంతరావు ఏం చేస్తారనేది..? ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న ప్రశ్న. తనకు ఇబ్బందులు కలిగించిన ప్రేంసాగర్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబడతారా…? లేక మెత్తబడతారా..? అన్నది వేచి చూడాలి. వాస్తవానికి తమ కార్యకర్తల దూకుడు, తప్పిదం వల్లనే ఈ సంఘటన జరిగిందని ప్రేంసాగర్ రావు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం చెప్పేందుకే ఆయన వీహెచ్ దగ్గరికి వెళ్లినట్లు సమాచారం. కానీ అందుకు ఆయన అవకాశం ఇవ్వలేదు. మిగతా నేతల ద్వారా ఈ విషయాన్ని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఈ షోకాజ్ నోటీసు వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందా..? లేక ప్రకంపనలు సృష్టిస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే అలాంటి బలమైన నేతలు వదులుకునేందుకు సిద్ధంగా లేరని పార్టీ వర్గాల సమాచారం. మరి ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తేలనుంది.