రాజన్న దర్శనానికి 6 గంటలు
రాజన్నసిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుంటున్నారు. వేలాది మంది భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకుంటున్నారు. సోమవారం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేస్తున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారాయి. పెద్ద సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం మొక్కు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.