తగ్గెదేలే.. ఢిల్లీలో తేల్చుకుంటా..
- ప్రేంసాగర్‌రావుకు షోకాజ్ నోటీసు వి0షయంలో హన్మంతరావు సీరియస్
-అది మామ అల్లుడికి రాసిన ఉత్తరం లెక్క ఉన్నది
- ఎస్సీ,ఎస్టీ, బీసీలం కాబట్టే మేమంటే చిన్న చూపు
-నోటీసు తీసుకున్న వ్యక్తి ఇంటికి పీసీసీ చీఫ్ వెల్లడం ఏంటి...?
-సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళ్లి అక్కడే తేల్చుకుంటా
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హన్మంతరావు పట్టుబడుతుండటమే దీనికి కారణం. తాజాగా సోమవారం విలేకరుల సమావేశం పెట్టి మరీ హన్మంతరావు సీరియస్ అయ్యారు. ఇందులో చాలా అంశాలపై ఆయన మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసు మామకు అల్లుడు ఉత్తరం రాసినట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హన్మంతరావు మండిపడ్డారు. షోకాజ్ నోటీసులో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉంటుందని అది ఎక్కడా లేదన్నారు. కేవలం ఇది ఒక డ్రామాలాగా ఉందని మండిపడ్డారు. ఉదయం షోకాజ్ నోటీసు జారీ చేసిన వ్యక్తి ఇంటికి సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఎలా వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సర్వే సత్యనారాయణ, జి.నిరంజన్లాంటి నేతలను షోజాక్ నోటీసు ఇచ్చి మూడు రోజుల్లో చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తాను బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అని, రాములు నాయక్ ఎస్టీ, తనతో పాటు ఎస్సీ నేతుల కూడా ఉన్నారని వారిని ఎమ్మెల్సీ వర్గం బూతులు తిట్టిందని అయినా ఏం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు కనీసం పరామర్శించలేదన్నారు. తాము బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లం కాబట్టే తమను పట్టించుకోలేదని ఆయన పరోక్షంగా వ్యాఖ్యనించారు. అటు చెన్నూరు, ఇటు బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గంలో ప్రేంసాగర్ రావు వంటి వ్యక్తి పెద్దరికం ఏంటని ఆయన ప్రశ్నించారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీలు మారి వచ్చాడని పార్టీలోనే గొడవ జరిగితే తాను రేవంత్‌రెడ్డికి మద్దతు చెప్పానని చెప్పారు. తన లాంటి సీనియర్లకే ఇలా జరిగితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటన్నారు..?
మీరు చర్యలు తీసుకోకపోతే తాను నేరుగా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలుస్తానని వెల్లడించారు. అక్కడే తమకు జరిగిన అన్యాయం వివరించి తేల్చుకుంటానని స్పష్టం చేశారు.