బీజేపీ తొలిత‌రం నేత ఇక లేరు..

బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లాలో చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో నివాసం వుంటున్నారు. సుదేష్మాను 1953లో వివాహం చేసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఈ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ జిల్లాలో మొదటి వ్యక్తి. జంగారెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్ గా పనిచేశారు.

జంగారెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పార్టీ సీనియర్ నేత తొలితరం బీజేపీ నేత జంగారెడ్డికి నివాళి అర్పించారు.

చందుపట్ల జంగారెడ్డి మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు, మార్గదర్శకులు జంగారెడ్డి మరణం బీజేపీకి తీరని లోటు అన్నారు. జంగారెడ్డి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలియజేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like