మంత్రి పరుగో పరుగు..
మంత్రులు అంటే ముందుగానే సమయానికి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. కానీ సమయం మరిచిపోయారో… లేక పనుల హడావిడిలో ఆలస్యం అయ్యిందో కానీ, ఓ మంత్రి తన పని కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జోరుగా నాయకులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా ఓ మంత్రి నామినేషన్ వేసే సమయానికి ఆలస్యం అయ్యారు. దీంతో ఆయన పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన యూపీలోని బల్లియా కలెక్టరేట్ వద్ద జరిగింది. ఉత్తరప్రదేశ్ క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ నామినేషన్ దాఖలు చేయడానికి ఆలస్యం కావడంతో బల్లియాలోని కలెక్టరేట్ కార్యాలయానికి పరుగెత్తారు. నిన్నటితో అక్కడ నామినేషన్ల గడువు ముగిసింది. నామినేషన్లు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసాయి. అయితే అప్పటికే టైం కావడంతో మంత్రిఉపేంద్ర తివారీ నామినేషన్ వేసేందుకు పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నామినేషన్ ప్రక్రియ ముగియడానికి మూడు నిమిషాల సమయం ఉండగానే రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) తివారీ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. బల్లియా జిల్లాలోని ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుంచి తివారీని భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.