కళ్యాణ వైభోగమే..
-ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో ఒకటైన 111 జంటలు
-లాంఛనంగా సారె పంపిణీ
-ఊపిరి ఉన్నంత కాలం ప్రజా సేవ : కోనేరు

మంచిర్యాల:సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం పెంచికల్‌పేట మండలంలోని భద్రకాళి దేవస్థానం సామూహిక వివాహాలకు వేదికైంది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో 111 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు చేశారు. వేద మంత్రోచ్ఛరణలు, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఈ వివాహాలు నిర్వహించారు. బంధువులు పుర ప్రముఖులు సమక్షంలో ఎమ్మెల్యే దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యహరించి వివాహాలు ఘనంగా జరిపించారు, అనంతరం బంధువులందరికీ భోజనం ఏర్పాటు చేసి వడ్డించారు, నూతన వధూవరులతో కలిసి భోజనం చేశారు,పెళ్లికి కావాల్సిన మట్టెలు మంగళసూత్రంతో పాటు పట్టుబట్టలు ఇంటి సామాగ్రిని సైతం అందించారు. పెళ్లి పెద్దగా వ్యవహరించి తమ పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే దంపతులకు వధూవరులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తానన్నారు. సహకరించిన దాతలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు కోనేరు దంపతులు 511 పెళ్లిళ్లు చేశారు. వివాహ వేడుకలకు ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు హాజరయ్యారు.