అంబేద్కర్ విజయం వెనుక.. ఆమె
నేడు రమాబాయి అంబేద్కర్ 124 జయంతి
ఆమె పొరాటం సామాన్య మైనది కాదు. అసామాన్యమైన త్యాగఫలం. “త్యాగం” అనే మాట కూడా ఆ కరుణామయరాలికి జోడించగానే దాని విలువ పెరుగుతుందనడంలో సందేహం లేదు. డా అంబేడ్కర్ ఈ దేశానికి, స్త్రీలకు, అట్టడుగు, అణగారిన వర్గాలకు చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదే. కానీ చరిత్ర గుర్తించని, మరుగున పడిన మహనీయ చరిత రమాబాయిది. భారత జాతికి ఓ మహోన్నత నాయకున్ని అందించడంలో చిరస్మరణీయురాలిగా మిగిలిపో యారు. రమాబాయి మరెవరో కాదు.. అంబేద్కర్ సతీమణి..
భర్త భవిష్యత్తు కోసం, జాతి భవితవ్యం కోసం వేగంగా పరుగులెడుతుంటే ఆ మార్గంలో కుటుంబ సమస్యలు అనే ముల్లు ఆమనకు గుచ్చు కోకుండా ఉండటానికి ఆ ముల్లు పై ఆమె చేతులు పెట్టి రక్తపు గాయాలతో ఆయనను మరింత ముందుకు సాగనంపింది. అంబేద్కర్ సతీమణి రమా భాయి 1897, మే 7న బికువలదకారు రెండవ కుమార్తెగా వాలంగ్ గ్రామంలో దపోలో దగ్గర జన్మిం చారు. వీరిది చాలా పేద కుటుంబం. తండ్రి కూలిపని చేసేవారు. బుట్టలో చేపలు పెట్టుకొని సముద్రపు తీరంలో అమ్మేవారు.
తన తొమ్మిదవ యేటనే రమాబాయి అంబేద్కర్ జీవితంలోకి ప్రవేశించారు. పెళ్లి జరిగి నప్పుడు అంబేద్కర్ పదవ తరగతి పూర్తిచేశాడు. నలుగురు సంతానాన్ని పెంచి పోషించే క్రమంలో రమాబాయి మీద వయస్సుకి మించిన భార్య తలు పడ్డాయి. దాదాపు తొమ్మిది దశాబ్దాల కిందట ఒక స్త్రీ ఒంటరిగా బండెడు సంసారాన్ని మోయగలిగిందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తను పడుతున్న కష్టాలను అంబేద్కర్కి ఏనాడూ తెలియనిచ్చేవారు కాదు. ఆ విధంగా తెలియడం వల్ల భర్త చదువుకి ఆటంకంగా తయారవుతుం దని భావించేవారు.
చాలామంది అంబేద్కర్ మిత్రులు సహాయ పడటానికి ముందుకొచ్చిన వారి సాయాన్ని రమాబాయి సున్నితంగా తిరస్కరించేవారు. కడు పేదరికంలో ఉన్నప్పటికీ, ఎప్పుడూ ప్రశాంత వదనంతో వుండేవారు.నమ్మకం, త్యాగం, అర్ధంచేసుకునే గుణం వీరిరువురినీ జీవితాంతం ఆనందంగా ఉండేట్లు చేసింది. అంబేద్కర్ ఇంటికోసం అసలు సమయం కేటాయించేవారు కాదు. అయినా సంసార బాధ్యతల్ని చక్కగా నిర్వహించేవారు. అంబేద్కర్ తన కిచ్చిన డబ్బు ముప్పై భాగాలుగా చేసేవారు. రోజుకొక భాగాన్ని మాత్రమే ఖర్చుపెట్టేవారు. పొదుపుగా యాభై రూపాయలు మాత్రమే ఇంటి ఖర్చులకు వాడి, మిగతా డబ్బును భర్త చదువు కోసం పొదుపు చేసేవారు. ఈమె కేవలం భార్యలా కాక ఒక తల్లిలా అంబేద్కర్ని కంటికి రెప్పలా కాపాడి భారత జాతికి ఓ మహోన్నత నాయకున్ని అందించడంలో చిరస్మరణీయురాలిగా మిగిలిపో యారు.
అంబేద్కర్ పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటిద గ్గర స్త్రీలంతా రమాబాయికి పంపవద్దని చెప్పారు. అక్కడ వేరే స్త్రీని పెళ్ళాడితే ఏంచేస్తావు? అని ప్రశ్నించారు. ఆమె అలాచేయక అంబేడ్కర్ అమెరికా వెళ్ళటా నికి సహకరించారు. ఇది ఆమెకు అతనిపై ఉన్న అచంచల విశ్వాసం, ప్రగాఢ మైన నమ్మకానికి నిదర్శనం. ఎన్నో ప్రతి కూల పరిస్థితులు వచ్చినా భర్తకు అండగా నిలిచారు రమాబాయి. రమాబాయి కొడుకులు రమేష్ గంగాధర్, యశ్వంత్, రాజరతన్, కూతురు ఇందు. ఒక్క యశ్వంత్ తప్ప మిగిలిన వారందరూ మరణించారు. పిల్లల మరణం ఆ దంపతుల్ని కుంగతీసింది. దాంతో రమాబాయి ఆనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా రాజరత్న మరణం ఆమెను తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది.
1935 మే 27న రమాబాయి 38 సంవత్సరాల వయసులోనే అంబేద్కరికి శాశ్వ తంగా దూరమయ్యారు. ఆమె మరణించిన తర్వాత అంబేద్కర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు సన్యాసం తీసుకోవాలని భావించారు. ఎంతోమంది మిత్రులు నచ్చచెప్పి అంబేడ్కర్ని మామూలు మనిషిగా మార్చారు. ప్రపంచ మేధాని అయిన అంబేద్కర్ జీవన గమనంలో రహదారిగా మారారు. ఇలాంటి ధన్యజీవి రమాబాయి. జీవితం అందరికీ ఆదర్శం. ఐదుగురు బిడ్డల్లో నలుగురు పిల్లలు ఒకరి తర్వాత ఒకరిగా ఆకలితోనూ, సరైన వైద్యం అందక మరణిస్తున్నా కడుపు కోతను భరిస్తూ భర్తను ఉద్యమంలో మరింత ముందుకు నడిపిస్తూ, పేడతట్ట నెత్తి మీద పెట్టుకొని, పిడకలు అమ్మి, ఏడు కోట్ల మంది అంటరాని బతుకులలో వెలుగులు చిమ్మటానికి భర్త అందరికి దీపంలా వెలగటానికి , ముందుకు సాగటానికి ఆమె తన రక్తాన్నే చమురుగా మార్చింది. చివరకు రక్తహీనతతో 38 ఏళ్ళకే మరణించింది. ఈ దేశం బంగారు భవిత కోసం సగానికిపైగా ఉన్న మహిళలు తమ దిశను తల్లి రమాబాయి వైపు నుంచి చూసుకుంటే ఆ కుటుంబం సమాజానికి చిరుదివ్వెలుగా వెలుగుతుంది.
అమ్మా నీ త్యాగం ఎన్నటికీ మరువం. నీకు జోహార్లు…