గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తాం
-సింగరేణి కి ఏదైనా జరిగితే అది బీజేపీ బాధ్యత
-తెలంగాణ పై కేంద్రం పగ బట్టింది
-బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ
-ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల : సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పగబట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హై టీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారని అన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న సింగరేణి ని ప్రైవేటు పరం చేయొద్దని కే టీ ఆర్ లేఖలో కోరారని వెల్లడించారు. నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలాన్ని వెంటనే ఆపాలని కే టీ ఆర్ డిమాండ్ చేశారన్నారు. సీఎం కెసీఆర్ ఇప్పటికే పీఎం మోడీ కి లేఖ రాసినా స్పందన లేదని, కార్మికులు సమ్మె చేసినా ఉలుకు లేదు పలుకు లేదని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేసినట్టే సింగరేణి ని ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ కుట్ర పన్నిందన్నారు. ఈ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామన్నారు.
గుజరాత్‌కు ఒక నీతి… తెలంగాణకు మరో నీతి..
కేంద్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో లిగ్నైట్ గనులను ఆ రాష్ట్ర సంస్థకు లీజుకు ఇచ్చిన కేంద్రం సింగరేణి గనులను మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. గుజరాత్ కు ఓ నీతి..? తెలంగాణకు ఓ నీతా..? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలమంతా కేంద్రం తీరు గమనిస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సింగరేణి అంటే ఆషామాషీ సంస్థ కాదన్నారు. సింగరేణి ని దెబ్బ కొట్టడం ద్వారా తెలంగాణ ప్రగతి ని దెబ్బకొట్టే ప్రయత్నం బీజేపీ కేంద్రప్రభుత్వం చేస్తోందన్నారు. కరెంటు అవసరాలను తీర్చే సింగరేణి ని దెబ్బకొడితే తెలంగాణ ప్రగతి ఆగుతుందని కేంద్రం కక్ష కట్టిందన్నారు. తెలంగాణ పై కేంద్రం పగ బట్టిందని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ నేతల భరతం పడితే కేంద్రం తప్పక దిగి వస్తుందని వెల్లడించారు.
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ
నల్ల చట్టాలు ఉపసంహరించుకునేలా రైతులు పోరాడి విజయం సాధించినట్టే సింగరేణిని బతికించుకునేందుకు పోరాడి తీరుతామన్నారు. అసలు విషయాలు పక్కన బెట్టి బీజేపీ, కాంగ్రెస్కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యల పై వివాదం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రాజ్యాంగ వ్యతిరేకి అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ హాయం లో రాజ్యాంగ సమీక్షకు కమిటీ వేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చాలా మంది బీజేపీ మంత్రులు అంబెడ్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. రాజ్యాంగ మొదటి సవరణతోనే రాష్ట్రాలకు భూ హక్కులను హరించారు.. ఇది అంబెడ్కర్ కు వ్యతిరేకం కాదా..? అని ప్రశ్నించారు. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం పెట్టాలని మేము ఆలోచించి అమలు చేస్తున్నాం .ఇన్నేళ్ల బీజేపీ చరిత్రలో కనీసం వంద అడుగుల విగ్రహాన్ని పెట్టాలని ఆలోచించారా..? అని అడిగారు.
కేసులు ఎందుకు పెట్టాలి..?
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దళిత బంధు ను మేనిఫెస్టో లో పెట్టే దమ్ము బీజేపీ కి ఉందా, దళితులకు తెలంగాణ లో అందుతున్న పథకాలు బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నాయా..? అని ప్రశ్నించారు. దళితులు బీజేపీ కి వ్యతిరేకులు కనుకే బీజేపీ కి తెలంగాణ లో దళిత ఎమ్మెల్యేలు లేరన్నారు. జై శ్రీరామ్ అనే బీజేపీ ఇపుడు రాజకీయ పబ్బం కోసమే జై భీమ్ అంటోందన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ పన్నిన ట్రాప్ లో దళితులు పడొద్దని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి సవరణలు చేసినా కొత్త రాజ్యాంగం తెచ్చినా అది అంబేడ్కర్ స్ఫూర్తి తోనే అన్నారు. కేసీఆర్ అనగానే రాత్రికి రాత్రే రాజ్యాంగం మారుతుందా..? అని ప్రశ్నించారు. రైతు ఉద్యమం లో 750 మంది రైతుల మృతికి కారణమైన ప్రధాని మోడీ పైనే మొట్టమొదటి కేసు పెట్టాలన్నారు. వెంకటా చలయ్య కమిషన్ వేసినందుకు బీజేపీ పై కేసు పెట్టాలన్నారు. అంబేడ్కర్ ను తిట్టిన బీజేపీ మంత్రుల పై కేసులు పెట్టాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కొత్త రాజ్యాంగం పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ బీజేపీ లు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.