31 లక్షలు
డిజిటల్ సభ్యత్వంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఈ నెల 5వ తేదీ వరకు 31 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసింది. గత ఏడాది గాంధీ జయంతి రోజున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్‌రోలర్స్‌కు శిక్షణ ఇచ్చి బూత్‌స్థాయిలో నవంబరు 9 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జనవరి 26 నాటికి రాష్ట్రంలో 30 లక్షలు సభ్యత్వం పూర్తిచేయాలని పీసీసీ లక్ష్యంగా నిర్దేశించింది. కొవిడ్ కేసులు పెరగడం, పండుగలు రావడం, సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవడం లాంటి కారణాలతో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయింది.
డిజిటల్ పద్ధతి కొత్త కావడం, పలు చోట్ల స్థానిక నేతలు ఆసక్తి చూపక పోవడంతో మొదట్లో ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. అయితే రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివా్‌సకృష్ణన్ వరుస సమీక్షలు నిర్వహించి వేగం పెంచారు. జనవరి 26 నాటికే టార్గెట్ పూర్తి చేయాలని భావించినా.. కాస్త ఆలస్యంగా బుధవారం నాటికి పూర్తయింది. దీంతో జనవరి 30 వరకు పీసీసీ గడువు పెంచింది. అయినా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో.. రెండోసారి ఫిబ్రవరి 9 వరకు పీసీసీ గడువు పెంచింది. ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 31 లక్షలకుపైగా కాంగ్రెస్ సభ్యత్వాలు పూర్తయ్యాయి. అందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా.. 28 లక్షల ఎనిమిది వేల ఆరువందల సభ్యత్వాలు పూర్తికాగా.. మరో మూడు లక్షలకుపైగా సభ్యత్వాలు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడంతో.. వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.
సభ్యత్వ నమోదులో అత్యధికంగా నల్గొండ పార్లమెంట్ స్థానంలో 3.70 లక్షలు సభ్యత్వం పూర్తయ్యి మొదటి స్థానంలో ఉంది. 2.85 లక్షల సభ్యత్వం పూర్తిచేసిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రెండో స్థానంలో కొనసాగుతుంది. 2.26 లక్షలతో రేవంత్‌రెడ్డి నియోజకవర్గం మేడ్చల్-మల్కాజిగిరి మూడోస్థానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.