మేడారంలో హెలీ రైడ్
మేడారం జాతరకు సంబంధించి హెలికాప్టర్ ప్రయాణానికి అందుబాటులోకి తెస్తున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. ఎంచక్కా గాల్లో విహరించాలని సరదా పడే వారి కోసం హెలీ రైడ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 13 నుంచి (ఆదివారం) నుంచి హెలీ రైడ్ అందుబాటులోకి రానుంది. బెంగళూరుకి చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ఆదివారం నుంచి హెలికాప్టర్ రైడ్ ప్రారంభిస్తుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు నడవనున్నాయి. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మేడారంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోవచ్చు. హన్మకొండ నుంచి రానుపోను ఒక్కొక్కరికి రూ.19,999గా నిర్ణయించారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్‌కి ఒక్కొక్కరికి రూ.3,700గా నిర్ణయించినట్లు పర్యాటక శాఖ తెలిపింది. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ములుగు జిల్లా కలెక్టర్ తెలిపారు. హెలీ రైడ్ వివరాల కోసం 94003 99999, 98805 05905 ఫోన్ నంబర్లు, లేదా info@helitaxii.com ద్వారా సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.