మళ్లీ కోర్టుకు అంగన్‌వాడీలు
మంచిర్యాల : అంగన్ వాడీ టీచర్లు మళ్లీ కోర్టు మెట్లెక్కనున్నారు. సూపర్ వైజర్ల పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన పరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందని ఇప్పటికే కొందరు అంగన్‌వాడీ టీచర్లు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కేసులో వాదనలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పలువురు టీచర్లు ఈ విషయమై కోర్టులో పిటిషన్ వేశారు. పలు అంశాలపై కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆ విషయంలో కోర్టు పరిశీలిస్తోంది. తాజాగా మిర్యాలగూడకు చెందిన కొందరు టీచర్లు సైతం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. నోటిఫికేషన్ విషయంలో తేడాలు ఉండటంతో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి అంశాలు విడివిడిగా ఉంటాయని తేలడంతో వారు కోర్టు మెట్లెక్కనున్నారు.
సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి..
ఈ సందర్భంగా పలువురు అంగన్‌వాడీలు సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకురానున్నారు. గతంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేయనున్నారు. సీనియారిటీకి మార్కులు కలపాలన్న ప్రతిపాదన సైతం కోర్టు ముందుంచనున్నారు. అవసరమైతే పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. వీటితో పాటు పలు అంశాలపై సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి తమకు ఇచ్చిన గైడ్స్‌లైన్స్ లో 90 ప్రశ్నలు, 45 మార్కులు అని చెప్పారని తెలిపారు. కానీ పరీక్షల్లో మాత్రం ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకురానున్నారు. పదవ తరగతి కనీస అర్హతగా గ్రేడ్ 2 సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి చెప్పిన అధికారులు, పరీక్షల్లో మాత్రం గ్రూప్ 1 స్థాయిలో ప్రశ్నాపత్రం ఇచ్చారని వాపోతున్నారు.
తమ పని తాము చేసుకుపోతున్న అధికారులు..
ఇలా అంగన్‌వాడీ టీచర్లు కోర్టుకు వెళ్లి పరీక్షలు రద్దు చేయాలని ఆలోచిస్తుండగా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. మెరిట్ వచ్చిన వాళ్లే కాకుండా అందరినీ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచిస్తున్నారు. దీంతో టీచర్లు అందరూ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసే పనిలో ఉన్నారు. కోర్టులో టీచర్ల వాదనలు నిలబడవని, ఎట్టి పరిస్థితుల్లో తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తీర్పు వచ్చాక హడావిడిగా రిక్రూట్‌మెంట్ చేసే బదులు ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు.