అత్యవసర విభాగం నుంచే ఆరోగ్యశ్రీ
హైదరాబాద్: నిమ్స్ అత్యవసర విభాగంలో చేరే రోగులకు ఊరట దక్కింది. గతంలో మాదిరి కాకుండా అత్యవసర విభాగం నుంచే ఆరోగ్యశ్రీ అమలు చేయాలని నిమ్స్ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఏదైనా ప్రమాదం, తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు ఆరోగ్యశ్రీ ఉన్నా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. సంబంధిత వార్డుకు తరలించాకే ఆరోగ్యశ్రీ అమల్లోకి వచ్చేది. తొలుత రూ.5 వేలు అడ్వాన్సు చెల్లించాక టెస్టులు, ఇతరత్రా ఫీజులు వసూలు చేసేవారు. కొందరు రోగులు ఈ ఛార్జీలు చెల్లించలేక అప్పటికప్పుడు ఉస్మానియా, గాంధీలకు వెళ్లేవారు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో ఎక్కువ మంది పేదలు నిమ్స్‌కు వస్తుంటారని, ఈ తరుణంలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం ద్వారా వారికి మేలు జరుగుతుందని అత్యవసర విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్ సునీల్ తెలిపారు.