తిరుమలలో ఇక నుండి హోటళ్లు ఉండవు
తిరుమలలోని ప్రైవేట్ వ్యక్తులు అమ్మే తినుబండారాలు, రెస్టారెంట్లను మూసివేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు గురువారం తీర్మానించింది. భక్తులందరికీ ఉచిత భోజనం అందించేందుకు అన్నప్రసాద విక్రయ కేంద్రాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. తిరుమలపై ఉన్న అన్ని ప్రధాన కూడళ్లలో అన్నప్రసాద విక్రయ కేంద్రాలు, కియోస్క్‌లు ఏర్పాటు చేసి ఆహారం సులువుగా అందేలా చూడాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమల కొండపై హోటళ్లు ఉండవని తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో ప్రైవేటు హోటళ్లను తొలగిస్తామని.. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీనే ఉచితంగా అన్న ప్రసాదం అందజేస్తుందని చెప్పారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరికీ ఒకటే ఆహారం లభిస్తుందని స్పష్టం చేశారు. హోటళ్లు లేకుండా, భక్తులకు భోజనం అందించేందుకు టీటీడీ తగిన చర్యలు తీసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో మరిన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ కోసం ఏర్పాట్లు చేస్తామని, భారీ ఎత్తున అన్న ప్రసాదం తయారీకి సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారు. ప్రైవేట్ ఫుడ్ ఆపరేటర్లకు నష్టం కలగకుండా టీటీడీ వారికి ఇతర వ్యాపారాలు నిర్వహించేందుకు లైసెన్స్‌లు జారీ చేస్తుందని తెలిపారు.
కోవిడ్ -19 మహమ్మారి సడలింపుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించి మార్చి 2020 నుండి నిలిపివేసిన దివ్య దర్శనం (పాదచారుల మార్గం), ఉచిత దర్శనం సహా అన్ని ఆర్జిత సేవలు, దర్శనాలను దశలవారీగా టీటీడీ త్వరలో తిరిగి ప్రారంభిస్తుందని సుబ్బారెడ్డి చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మహా ద్వారం, బంగారు వాకిలి, గోపురంపై బంగారు తాపడం చేసేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని బోర్డు టీటీడీని ఆదేశించింది. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని 230 కోట్లతో నిర్మించాలని బోర్డు నిర్ణయించింది. తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయాన్ని శ్రీ బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజుకు ఇవ్వాలని ట్రస్ట్ బోర్డు తీర్మానించింది. సైన్స్ సిటీకి మంజూరైన 70 ఎకరాల్లో 50 ఎకరాలను వెనక్కి తీసుకుని ఆ స్థలంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది.