పురాణం కినుక
- కొద్ది రోజులుగా కార్యక్రమాలకు దూరం
- ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ కాలేదు
- జిల్లా అధ్యక్ష పదవి దక్కలేదు
- అందుకే అలిగినట్లు భావిస్తున్న పార్టీ శ్రేణులు
మంచిర్యాల : పురాణం సతీష్ అలక వహించారా…? అందుకే కొద్ది రోజులుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా..? తనకు పదవులు దక్కలేదని మౌనం వహిస్తున్నారా…? అందుకే ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారా..? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు..
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిచయం అక్కరలేని పేరు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆయన ఎన్నో పదవుల్లో పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008, ఫిబ్రవరి 7న తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, 2010 నుంచి ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు
తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో తన పదవి రెన్యూవల్ అవుతుందని భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్ దండే విఠల్‌కు కేటాయించారు. కనీసం జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని భావించినా అది కూడా అడియాసే అయ్యింది. దీంతో పురాణం సతీష్ అలక వహించారు.. అయినా సైలెంట్‌గానే ఉండిపోయారు. ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆందోళనకు సిద్దమయ్యారు. కానీ వారు కూడా సైలెంట్ అయ్యారు. తనకు చివరకు ఏదైనా కార్పొరేషన్ పదవి దక్కుతుందని భావిస్తున్న ఆయనకు ఎలాంటి పదవి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
దీంతో ఆయన మౌనం వహించారని చెబుతున్నారు. మొన్నటి వరకు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే పురాణం సతీష్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి మొదటి సారి జిల్లాకు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో సైతం జిల్లాలో పాల్గొనలేదు. ఆసిఫాబాద్ జిల్లాలో వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాకు మాత్రం రాలేదు. పదవుల విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆయన దూరంగా ఉంటున్నట్లు అందరూ భావిస్తున్నారు. మరి ఆయన మౌనం ఎంత వరకు అనే విషయం మాత్రం ఎవరికి అర్ధం కావడం లేదు.
పార్టీ మారే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని పలువురు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన వైపు నుంచి కానీ, ఆయన అనుచరుల నుంచి అలాంటి సంకేతాలు ఏమీ రావడం లేదు. ఇప్పటికిప్పుడు పార్టీ మాత్రమే లాభం కంటే నష్టమే ఎక్కువ అని పురాణం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఆయన పార్టీ మారుతారా..? లేదా ఇలాగే మౌనంగా ఉంటారా..? కొద్ది రోజుల వరకు తేలే అవకాశం లేదు.