బీజేపీ పార్టీకి భారీ షాక్

-ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌లువురు రాజీనామా
-మాజీ జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌, మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గుడ్‌బై

మంచిర్యాల : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి ప‌లువురు నేత‌లు రాజీనామా చేసి వివిధ పార్టీల్లో చేరుతున్నారు. సోమ‌వారం బీజేపీ పార్టీకి చెందిన వారు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ బిజెపి పార్టీకి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడాం గణపతి రాజీనామా చేశారు. ఆయ‌న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేర‌నున్నారు. రేపు కాగజ్ నగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆ పార్టీలో చేర‌నున్నారు. ఇక మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు మ‌ద్ది శంక‌ర్ సైతం రాజీనామా చేశారు. ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరే విధానాలు నచ్చక బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి మద్ది శంకర్‌తో పాటు మరికొంత మంది రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తెలంగాణ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు న‌చ్చ‌క‌ప పార్టీ వీడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. తెలంగాణ సమాజం పట్ల చిన్న చూపు, వివక్ష చూపుతున్న భారతీయ జనతా పార్టీ విధానాలతో విసిగిపోయాన‌ని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి బీజేపీలో విలువ లేదన్నారు. ఆ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని శంకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సింగరేణి కార్మికులు బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని మూడు రోజులు సమ్మె చేసినా.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించిందని మండిపడ్డారు. తనతో పాటు బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షుడు అందుగుల లక్ష్మణ్‌, బియ్యాల సమ్మయ్య , పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి దోనుగు రమేష్‌, పట్టణ పార్టీ కోశాధికారి మురళి, యువ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు రంగు రమేష్‌, బీసీ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్‌ అధ్యక్షులు బండి రవి, చెల్లేటి తిరుపతయ్యలు కూడా రాజీనామా చేస్తున్నారని శంకర్‌ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like