పద్మక్కకు.. పాదాభివందనం..
అల్లం పద్మ మరణానికి మావోయిస్టు పార్టీ సంతాపం
అల్లం పద్మ మరణానికి తమ పార్టీ తీవ్ర సంతాపం తెలుపుతోందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పేరిట బుధవారం లేఖ విడుదల చేశారు. కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో భాదపడుతూ ఫిబ్రవరి 22 వ తేదిన తుది శ్వాస విడిచిన అల్లం పద్మ మరణం పట్ల మావోయిస్టు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నదన్నారు. ప్రజా స్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ తన వంతు బాధ్యత వహించిందని వెల్లడించారు. ప్రజా స్వామిక తెలంగాణ కోసం ఎంతో పరితపించి శక్తి వంచన లేకుండా శ్రమించిందని గుర్తు చేశారు. పోరాడుతున్న ఉద్యమకారులకు మద్దతునందించి స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపిందన్నారు. తాను ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యమకారులు ఉత్సాహంగా వీరోచితంగా పోరాడారని వెల్లడించారు. విరామం ఎరుగక పోరాడిన పోరాట శ్రేణులకు అలసట లేకుండా ఎంతో ఓపికతో భోజనాలు ఏర్పాటు చేసి ఎన్నో సేవలందించిందన్నారు. అందరికి అప్యాయతలు పంచిన అల్లం పద్మ తెలంగాణ అమ్మగా గుర్తింపు పొందిందని తెలిపారు. తల్లి పాత్ర పోషించి, స్ఫూర్తిని నింపిన అల్లం పద్మను తెలంగాణ సమాజం, ముఖ్యంగా ప్రజా స్వామిక తెలంగాణ నినాదంతో పోరాడిన ఉద్యమ శక్తులు ఎన్నటికీ మరిచి పోవని ఆయన స్పష్టం చేశారు. అల్లం పద్మ మరణం మా పార్టీని తీవ్రంగా కలతకు, బాధకు గురి చేసిందన్నారు. అందరిలో ఎంతో గుర్తింపు పొందిన పద్మ భౌతికంగా తెలంగాణ సమాజంలో లేదని చెప్పడానికి చింతిస్తున్నామన్నారు.